బెజవాడ హవాలా.. ఎందుకు.. ఎలా?
విజయవాడ కేంద్రంగా సాగుతున్న హవాలా కేసు పలు రకాల మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లూ చాపకింద నీరులా ఎవరికీ తెలియకుండా సాగిపోయిన హవాలా వ్యవహారం ఇప్పుడు ఉన్నట్టుండి బయటకు రావడంతో పలువురు పెద్దమనుషులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడ తమ బాగోతాలు కూడా బయటపడతాయోనని, తమ జుట్టు ఆదాయపన్ను శాఖ చేతుల్లోకి వెళ్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 15-20 ఏళ్ల క్రితం నుంచే ఆంధ్ర ప్రాంతానికి విజయవాడ ఆరోగ్య రాజధానిగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఆస్పత్రులు వెలిశాయి. మొదట్లో కేవలం ఒకటి లేదా రెండు స్పెషాలిటీలతోనే ప్రారంభమైన చాలా ఆస్పత్రులు తర్వాతి కాలంలో మల్టీ స్పెషాలిటీలుగా మారాయి. ఈ విస్తరణకు సహజంగానే పెద్దమొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. కావల్సిన మొత్తం సొమ్మును సక్రమ మార్గంలో సమకూర్చుకోవడం కష్టమన్న ఉద్దేశంతో కొంతమంది వైద్యులు హవాలా మార్గాన్ని కూడా ఆశ్రయించారు.
కేవలం వైద్యరంగమే కాదు.. అన్ని రంగాలకు చెందినవారు ఈ మార్గంలో వెళ్తున్నారనడంలో అనుమానం లేదు. అందుకే చిరు వ్యాపారులు సైతం ఈ హవాలా వ్యాపారంలోకి దిగారు. తమకు కావల్సిన డబ్బును ఇక్కడకు తెప్పించుకోడానికో, లేదా ఇక్కడినుంచి కొంత డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడానికో వైద్యులు బ్రహ్మాజీని పురమాయించి ఉండాలి. ఎంత డబ్బు చేతులు మారింది, అందులో కమీషన్ ఎంత అనే విషయాలేవీ మాత్రం ఇంతవరకు బయటకు రావడం లేదు. 50 కోట్ల రూపాయలు తెప్పించడానికి కోటి రూపాయలను బ్రహ్మాజీరావు కమీషన్‌గా తీసుకున్నట్లు నిందితుల తరఫు వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలంటే ఆదాయపన్ను శాఖ అధికారుల కన్ను పడుతుందనే హవాలా మార్గాన్ని ఎంచుకుని ఉండాలి. అయితే, అసలు హవాలా అంటే ఏంటో తనకు తెలియదని బ్రహ్మాజీరావు చెబుతున్నారు.
హవాలా.. ఎలా?
సాధారణంగా హవాలా పద్ధతిలో పనులన్నీ కేవలం నమ్మకం ఆధారంగా జరిగిపోతుంటాయి. ఒకచోట ఉన్నవాళ్లు డబ్బులు ఇచ్చి, ఫలానా ప్రాంతంలో ఉన్న తమవాళ్లకు ఆ డబ్బును ఇవ్వాలని చెబుతారు. అందుకోసం కొన్ని కరెన్సీ నోట్లను ఉపయోగించుకుంటారు. ఆ నోట్లు కూడా చేతులు మారుతున్న మొత్తాన్ని బట్టి మారుతాయి. 5 కోట్ల వరకు అయితే 5 రూపాయల నోటు.. ఇలా రకరకాల నోట్లను ఉపయోగిస్తారు. ఆ నోటు మీద ఉన్న నంబరు నోట్ చేసుకోవడం, దాన్ని కొరియర్ ద్వారా అవతలి వ్యక్తికి చేరవేయడం.. వాళ్లు తమకు వివరాలు అందిన మేరకు ఎక్కడ డబ్బులు ఇస్తారో అక్కడకు వెళ్లి ఆ నోటు చూపించి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం మొట్టమొదట డబ్బు ఇచ్చినవాళ్లే కొంత కమీషన్ కూడా ముట్టజెప్పాల్సి ఉంటుంది. పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో అప్పటికే పెద్దమొత్తాల్లో డబ్బు తీసుకుని తమ వద్ద ఉంచిన హవాలా వ్యాపారులు చాలా దెబ్బతిన్నారని వినికిడి.
ఇక్కడ ఏమైంది...
బ్రహ్మాజీరావు తమ హవాలా వ్యవహారాన్ని పూర్తిచేయలేకపోవడంతో వైద్యులు అతడికి బాగా తెలిసిన తాతాజీ అనే వ్యక్తితో ఫోన్ చేయించి పిలిపించారు. టైమ్ ఆస్పత్రి పేరు మీద రిజిస్టర్ అయిన ఏపీ 16బీఎం 2324 నంబరు గల ఇన్నోవా వాహనంలో అతడిని విజయవాడ శివార్లలో ఉన్న మామిడితోటకు తీసుకెళ్లి.. అక్కడ చితక్కొట్టారు. వాళ్ల వద్ద కమీషన్‌గా ఇచ్చిన మొత్తానికి బదులుగా బ్రహ్మాజీ వాళ్లకు బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇచ్చి, ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేశాడు. దాంతో వాళ్లు అతడిని వదిలేశారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు పటమట స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖ వైద్యుల పేర్లు ఉండటంతో సీఐ కెనడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు కేసును నీరుగార్చారని ఆరోపణలు వచ్చాయి. చివరకు విషయం మొత్తం సీపీ గౌతమ్ సవాంగ్ వరకు వెళ్లడంతో ఆయన వాళ్లిద్దరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని అంటున్నారు. అధికార పార్టీ పెద్దల రాజకీయ జోక్యం పనిచేస్తే ఇక ముందు కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఈలోపు అసలు ఈ కేసు గురించిన వివరాలు తమకు అందించాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.