స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలిస్తున్న సీపీ ద్వారకా తిరుమలరావు
సాక్షి, అమరావతి బ్యూరో : వాణిజ్య నగరంగా పేరొందిన విజయవాడలో కొందరి నిర్వాకం ఫలితంగా వ్యాపారులకు అక్రమ రవాణా మకిలీ అంటుకుంటోంది. ముంబై నుంచి నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండా ఇక్కడికి పసిడిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తరలింపునకు చాలా సులువుగా రైలు, పార్శిల్ సర్వీస్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముంబయిలో రైలెక్కితే.. విజయవాడలో దిగే వరకూ ఎక్కడా పెద్దగా తనిఖీలు ఉండకపోవటం అక్రమార్కులకు కలసి వస్తోంది. స్టేషన్ నుంచి ఒన్‌టౌన్‌కు ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. పార్శిల్ సర్వీస్ కేంద్రాలు కూడా పాతబస్తీలోనే ఉండటంతో వారి పని సులువు అవుతోంది.
నిఘా పెరగడంతో..
అక్రమ మార్గంలో బంగారం, నగదు తరలిస్తున్న ముఠాలపై నగరంలో సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. అక్రమార్కుల బండారం క్రమంగా బయట పడుతోంది. గతేడాది డిసెంబర్ 2వ తేదీన విజయవాడకు చెందిన రాజుసింగ్, అర్జున్‌సింగ్ అనే ఇద్దరు సోదరులు ఒన్‌టౌన్ ప్రాంతంలో తయారుచేసిన రూ. 79.56 లక్షల విలువైన 221.2 కేజీల వెండి వస్తులను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సరైన ఆధారాలు లేవు. ఆ వెండిని మాత్రం మహారాష్ట్రలోని కోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత ఈ ఏడాది మార్చి 9న గవర్నర్‌పేటలో జైహింద్ కాంప్లెక్స్ బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్న రాజేష్‌కుమార్ జైన్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ. 1.92 కోట్ల విలువైన 6.257 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమమార్గంలో బెజవాడకి తరలించిన బంగారాన్ని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా సోమవారం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని మటంవీధిలోని మరుధర్ ఎక్స్ పార్శిల్ సర్వీస్ నుంచి కొరియర్ సర్వీస్ మాటున ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో రవాణా చేస్తున్న రూ. 57.17 లక్షల విలువైన 1.77 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 16 లక్షల విలువైన 40 కిలోల వెండి వస్తువులతోపాటు హవాలా మార్గంలో 15.12 లక్షల నగదును సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 88.29 లక్షల విలువైన వీటిని అదేప్రాంతానికి చెందిన నారాయణ్‌సింగ్, ప్రదీప్‌సింగ్, యోగినా«థ్‌స్వామిలను అదుపులోకి తీసుకున్నారు.
హవాలా మార్గంలో అక్రమ రవాణా
బెజవాడకు వాణిజ్య నగరమనే మారుపేరు. పసిడి వర్తకం బాగా నడుస్తోంది. ఇటీవల కాలంలో అనుమతి లేని బంగారం ఆభరణాలతోపాటు నగదు కూడా ముంబయి నగరం నుంచి హవాలా మార్గంలో దిగుమతి అవుతోంది. ఇదే విషయాన్ని సాక్షి ‘కోడ్.. డీల్’ పేరిట హవాలా మార్గంలో నగరంలోకి బంగారం, నగదు తరలుతున్న వైనంపై మార్చి 24న కథనం ప్రచురించాం.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక పోలీసుల తనిఖీల్లో ఈ నెల 1వ తేదీన రూ. 1.25 కోట్లను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు దాదాపు రూ. 1.70 కోట్లను ఇక్కడ పంపిణీ చేస్తుండగా.. పోలీసులమని చెప్పి కొందరు వారి వద్ద నుంచి దోచుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మార్గంలోనే బెజవాడకు చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసినపుడు మాత్రమే ఈ తరహా గుట్లు బయట పడుతున్నాయి. లేదంటే అంతే సంగతి. బిల్లులు లేని వ్యాపారం చేస్తున్న కొందరు ప్రభుత్వాదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇప్పటికైనా వాణిజ్య, ఆదాయపన్ను, పోలీసు, రైల్వే శాఖ అధికారులు సమష్టిగా ఈ తరహా విధానానికి చెక్ పెట్టే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment