మరో భారీ స్కాం : హవాలా కింగ్ అరెస్ట్
ముంబై : మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ హవాలా కింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూక్ షేక్ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కోట్ల కొద్దీ ఈ రూపాయలను నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా విదేశాలకు తరలించడానికి ఫరూక్ 13 కంపెనీలను వాడినట్టు ఈ ఫైనాన్సియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. 2015-16లో రూ.2,253 కోట్లగా ఉన్న ఈ రెమిటెన్స్, ప్రస్తుతం రూ.10వేల కోట్లను దాటిపోయినట్టు కూడా ఈడీ అంచనావేస్తోంది.
2015-16లో ఈ 13 కంపెనీలు బ్యాంకులకు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి, రూ.2,253 కోట్ల నగదును విదేశాలకు పంపించాయని ఈడీ పేర్కొంది. అయితే ఎంట్రీలో నమోదు చేసిన అసలు బిల్లులు, విలువ, ఆ ఉత్పత్తుల పరిమాణం చూసుకుంటే అవి రూ.24.6 కోట్లేనని తేలింది. ఈ 13 సంస్థలకు కూడా నకిలీ అడ్రస్‌లు, డమ్మీ వ్యక్తులే బోర్డు డైరెక్టర్లగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా ఫరూక్ మొత్తం 135 బ్యాంకు అకౌంట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ 13 సంస్థలతో తనకేమీ సంబంధాలు లేనట్టు ఫరూక్ చెబుతున్నాడు. అతన్ని ఏప్రిల్ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
ఈ స్కాంను సీబీఐ గత మేలో వెలుగులోకి తీసుకొచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ స్కాండల్‌గా దీన్ని పేర్కొంది. ఈ స్కాంలో ఫరూక్ ప్రమేయమున్నట్టు ఈ మధ్యనే తేలింది. ఈ కేసు కోసం 149 బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సమయంలో ఫరూక్ మూడు మొబైల్ నంబర్లను ఉపయోగించినట్టు తెలిసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అతన్ని విచారించింది. కానీ వారి విచారణకు ఫరూక్ సహకరించకపోవడంతో, ఏజెన్సీ అతన్ని అరెస్ట్ చేయాలని భావించింది. ఈ స్కాంలో కెనారా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, కార్పొరేషన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు అధికారులకు భాగమున్నట్టు సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది.