సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ..
* ఏసీపీ వాహనాన్ని ఢీకొన్న బైక్
* ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆటోనగర్: సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ బైకుపై వచ్చిన ఇద్దరు, ఏసీపీ వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం... హయత్‌నగర్ పద్మావతికాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన సూర్యప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడిస్తున్నారు.
వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్యప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హయత్‌నగర్ పోలీసుల నిర్లక్ష్యం...
హయత్‌నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలెం నుంచి సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ ఇద్దరు వ్యక్తులు దాదాపు 8 కిలోమీటర్ల వరకు బైకుపై వచ్చారు. సీఎం నగరానికి వచ్చే సమయంలో హయత్‌నగర్ పోలీసులు జాతీయ రహదారిపై భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. తీవ్రవాదులు ఇలాంటి ఘటనకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉండేదని స్థానికంగా చర్చ జరుగుతుంది.