గుడ్‌బై హేలీ.. గుడ్‌బై!
లండన్: 'అన్ని రకాలుగా నేనెంతో అదృష్టవంతురాలినని భావిస్తా. నేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కలుసుకున్నా. ఎంతో మంది తమ జీవితకాలంలో చేసినదానికంటే నేను ఎక్కువే చేశాను. నాకు ఈ జీవితం చాలు' అంటూ ఎంతో మందికి ఎన్నోరకాలుగా స్ఫూర్తినిచ్చిన 17 ఏళ్ల హేలీ ఒకైన్స్కు శుక్రవారంతో నూరేళ్లు నిండిపోయాయి. మూడేళ్ల క్రితం డాక్యుమెంటరీల ద్వారా, ఇటీవల ఆత్మకథ ద్వారా ప్రపంచానికి సుపరిచితమైన హేలీ చనిపోయిన విషయాన్ని ఆమె తల్లి కెర్రీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
'నా బిడ్డ ఎక్కడికో వెళ్లి పోయింది. రాత్రి 9.30 గంటలకు నా చేతుల్లోనే తుదిశ్వాస విడిచింది' అన్న ఆ సందేశాన్ని చూసి స్పందించి... ప్రొగేరియా కుటుంబం మొత్తం ఆమెకు నివాళులర్పించింది.
''చురుగ్గా, అందంగా ఉండే ఓ ఇంగ్లీషు గులాబీ పువ్వా! గుడ్‌బై...హేలీ ఓకైన్స్, గుడ్‌బై. మీ అమ్మ పంపిన సందేశాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాం'' అంటూ ది ప్రొగేరియా రీసర్చ్ ఫౌండేషన్ తన ఫేస్బుక్లో శనివారం ఘనంగా నివాళులర్పించింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ససెక్స్‌లో నివసిస్తున్న హేలీ ఓకైన్స్ ప్రొగేరియా అనే అరుదైన జన్యుపరమైన జబ్బుతో జన్మించింది. 'పా' సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇలా.. ప్రొగేరియా బాధితుడి పాత్రనే పోషించారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 74 ఉన్నాయి. ఈ జబ్బుగల వారికి ముందే ముసలితనం ముంచుకొస్తుంది. సాధారణ వ్యక్తులకన్నా వారిలో 8 రెట్లు ఎక్కువ వయస్సు మీద పడుతుంది. పదవ ఏటనే 80 ఏళ్ల పైబడినవారిలాగా పూర్తిగా జుట్టూడి పోతుంది. గుండె జబ్బులు వస్తాయి. కీళ్ల నొప్పులతో బాధ పడతారు. సాధారణంగా 13 ఏళ్లలోపే మరణిస్తారు. హేలీ మాత్రం 17 ఏళ్లు బతకడం ఆశ్చర్యకరమని వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు. జన్యుపరంగా ఆమె శరీరంలో చోటుచేసుకున్న మార్పులను పరిగణలోకి తీసుకుంటే ఆమె 146 ఏళ్లు బతికినట్టులెక్క. ఆమె గుండె నిబ్బరం, చిన్నతనంలోనే జీవితం పట్ల అవగాహన పెంచుకోవడం, బతికినంత కాలం అనుక్షణం జీవించాలని కోరుకోవడం లాంటి లక్షణాలు ఆమెను ఇంతకాలం బతికించాయని చెప్పవచ్చు. హేలీ తన జీవితం చిన్నదని తెలిసి డాల్ఫిన్స్‌తో ఆడుకుంది. ప్రపంచ దేశాలు తిరిగింది. ప్రిన్స్ చార్లెస్‌ను కలుసుకొంది. ఆస్ట్రేలియా సింగర్ కైలీ మినోగ్, కెనడా సింగర్ జస్టిన్ బీబర్‌తో కలిసి ఆడింది పాడింది. అనేక టీవీ డాక్యుమెంటరీలో కనిపించింది. ఇప్పుడు అందరికీ వీడ్కోలు చెప్పింది.