ఆన్లైన్ ద్వారా సహారా ఆస్తుల వేలం!
♦ రిజర్వ్ ధర రూ.1,200 కోట్లు
♦ ఆక్షన్ ప్రక్రియకు హెచ్డీఎఫ్సీ రియల్టీ,
♦ ఎస్బీఐ క్యాపిటల్ శ్రీకారం
న్యూఢిల్లీ: సహారా ఆస్తుల అమ్మకానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నియమించుకున్న హెచ్డీఎఫ్సీ రియల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ-వేలం ద్వారా కంపెనీకి చెందిన ఆస్తులను అమ్మనున్నాయి. ఇందుకు దాదాపు రూ.1,200 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించాయి. 31 ల్యాండ్ పార్శిళ్లను రూ.2,400 కోట్లకు విక్రయించడానికి హెచ్డీఎఫ్సీ రియల్టీకి సెబీ అనుమతి ఉంది. ఇక ఎస్బీఐ క్యాప్ విషయంలో 30 ల్యాండ్ ప్రొపర్టీల అమ్మకాలకు అనుమతి ఉంది. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.4,100 కోట్లు. సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందుకుగాను సెబీ హెచ్డీఎఫ్సీ రియల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ సహాయాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
హెచ్డీఎఫ్సీ పబ్లిక్ నోటీస్..: దీని ప్రకారం... జూలై 4 వ తేదీ ఉదయం 11 గంటల నుంచీ 12 గంటల వరకూ గంటపాటు నాలుగు ల్యాండ్ పార్మిళ్లకు సంబంధించి ఈ-ఆక్షన్‌ను నిర్వహించనుంది. రిజర్వ్ ధర రూ.722 కోట్లు.
ఎస్బీఐ క్యాప్ విషయానికి వస్తే..: జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ ఐదు ల్యాండ్ పార్శిల్స్‌కు సంబంధించి ఈ-ఆక్షన్ జరుగుతుంది. రిజర్వ్ ధర రూ.470 కోట్లు.
ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి..: ఆక్షన్ పరిధిలో ఉన్న భూములు ఆంధ్రప్రదేశ్‌సహా తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నట్లు సమాచారం. బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే బిడ్డర్లు జూన్ 8 నుంచి జూన్ 10 రోజుల్లో ఆస్తులను పరిశీలించుకోడానికి సమయాన్ని కేటాయించడం జరిగింది.