H.D.Kumara Swamy
-
KCR BRS Party: 'బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం'
సాక్షి, బెంగళూరు(శివాజీనగర): కర్ణాటకలో 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోమని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి స్పష్టం చేశారు. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న కోలారు, రాయచూరుతో పాటు సరిహద్దు ప్రాంతాల నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు అన్ని విధాలా సహకారం అందించనున్నారని వివరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో 150 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయవచ్చని, దీంతో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు జరగవచ్చని అభిప్రాయపడ్డారు. తాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోమని స్పష్టం చేశారు. తమది చిన్న పార్టీ అని.. కర్ణాటకలో మాత్రమే పోటీలో ఉంటామని కుమారస్వామి పేర్కొన్నారు. చదవండి: (బీఆర్ఎస్గా పేరు మార్చండి) -
నాపై కుట్ర చేస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సాక్షి, బెంగళూరు : ‘సాయి వెంకటేశ్వర మైన్స్ కేసుకు సంబంధించి నన్ను ప్రత్యేక విచారణృబందం(ఎస్ఐటీ) అధికారులు అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇది కేవలం నా పై జరుగుతున్న కుట్ర మాత్రమే’ అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐటీ ఇచ్చిన నోటీసులు తిరస్కరించానని, అందువల్ల ఎస్ఐటీ అధికారులు తనను అరెస్ట్ చేశారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారమైనదని కుమారస్వామి తెలిపారు. బీబీఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీని వెనక్కునెట్టి తమ పార్టీ ప్రజాదరణను సాధిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, జేడీఎస్ పార్టీపై ప్రజల్లో గందరగోళాన్ని పెంచేందుకే ఈ తరహా అబద్దపు వార్తలను ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఇక సీఎం నేతృత్వంలో ఆయన క్యాంపు కార్యాలయం నుంచే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇక ఈ వార్త ప్రచురితమైన పత్రిక ఎడిటర్‌తో పాటు వార్త రాసిన విలేకరిని సంప్రదించేందుకు తాను ప్రయత్నించినప్పటికీ ఫోన్లో ఎవరూ అందుబాటులోకి రాలేదని అన్నారు. కాగా, తనపై నిరాధార వార్తలు రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. ఇక విచారణకు సంబంధించి తానేనాడూ వెనకడుగు వేయలేదని , నిజానిజాలు ప్రజలకు తెలియడమే తనకూ కావాలని అన్నారు. సాయి వెంకటేశ్వర మైన్స్‌కు సంబంధించి మార్చిలో ఓసారి తనకు నోటీసులు అందాయని, ఆ తర్వాత జూలై 30న ఎస్ఐటీ నోటీసులు జారీ చేయగా ఈ రెండు సందర్భాల్లోనూ తాను స్వయంగా విచారణకు హాజరై వివరాలను వెల్లడించానని తెలిపారు. సింగిల్ డిజిట్ లాటరీ, ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద వృుతి తదితర అంశాల్లో తాము ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నామని, అందుకే జేడీఎస్ అడ్డును తప్పించుకునే లక్ష్యంతోనే తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. -
ఆస్తి ఉందని చూపిస్తే... రాసిచ్చేస్తా
- కుమారస్వామి ఆరోపణలపై మండిపడ్డ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : కెంగేరి ప్రాంతంలో తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి నిరూపించగలిగితే ఆయనకే రాసిచ్చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. కెంగేరి ప్రాంతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరులో ఆదివారం చేసిన ఆరోపణలపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందు సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి ఎంతమాత్రం తగదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇకమీదటైనా కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలని కుమారస్వామికి సూచించారు. ఇక ఇదే సందర్భంలో సిం గిల్ డిజిట్ లాటరీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని, అయినా ఇప్పటికీ ఈ వ్యవహారంపై కుమారస్వామి రాద్ధాం తం చేయడంలో ఏమాత్రం అర్థం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. సీబీఐ విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని, అప్పటి వరకు వేచి చూడాలని కుమారస్వామికి సూచించారు. -
సిద్ధు వైఖరి అనుమానాస్పదం
హెచ్.డీ కుమారస్వామి సాక్షి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్-2011 పోస్టుల రద్దుపై బహిరంగ చర్చకు సిద్ధరామయ్య వెనుకడుగు వేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తోందని హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఫ్రీడం పార్క్‌లో చేపట్టిన నిరశన దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. ఆందోళనకు ఆది నుంచి మద్దతు తెలుపుతున్న కుమారస్వామి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... ఈ విషయంపై తొలుత బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం మాట మారుస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కేపీఎస్సీ-11 నియామకాల రద్దుపై పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సీఎం సిద్ధరామయ్యకు ఆయన రాశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రులు దినేష్ గుండూరావు, హెచ్.ఆంజనేయులు సమర్థించారు. అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.