నాపై కుట్ర చేస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : ‘సాయి వెంకటేశ్వర మైన్స్ కేసుకు సంబంధించి నన్ను ప్రత్యేక విచారణృబందం(ఎస్‌ఐటీ) అధికారులు అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇది కేవలం నా పై జరుగుతున్న కుట్ర మాత్రమే’ అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పేర్కొన్నారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐటీ ఇచ్చిన నోటీసులు తిరస్కరించానని, అందువల్ల ఎస్‌ఐటీ అధికారులు తనను అరెస్ట్ చేశారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారమైనదని కుమారస్వామి తెలిపారు.
బీబీఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీని వెనక్కునెట్టి తమ పార్టీ ప్రజాదరణను సాధిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, జేడీఎస్ పార్టీపై ప్రజల్లో గందరగోళాన్ని పెంచేందుకే ఈ తరహా అబద్దపు వార్తలను ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ఇక సీఎం నేతృత్వంలో ఆయన క్యాంపు కార్యాలయం నుంచే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇక ఈ వార్త ప్రచురితమైన పత్రిక ఎడిటర్‌తో పాటు వార్త రాసిన విలేకరిని సంప్రదించేందుకు తాను ప్రయత్నించినప్పటికీ ఫోన్‌లో ఎవరూ అందుబాటులోకి రాలేదని అన్నారు. కాగా, తనపై నిరాధార వార్తలు రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.
ఇక విచారణకు సంబంధించి తానేనాడూ వెనకడుగు వేయలేదని , నిజానిజాలు ప్రజలకు తెలియడమే తనకూ కావాలని అన్నారు. సాయి వెంకటేశ్వర మైన్స్‌కు సంబంధించి మార్చిలో ఓసారి తనకు నోటీసులు అందాయని, ఆ తర్వాత జూలై 30న ఎస్‌ఐటీ నోటీసులు జారీ చేయగా ఈ రెండు సందర్భాల్లోనూ తాను స్వయంగా విచారణకు హాజరై వివరాలను వెల్లడించానని తెలిపారు. సింగిల్ డిజిట్ లాటరీ, ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద వృుతి తదితర అంశాల్లో తాము ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నామని, అందుకే జేడీఎస్ అడ్డును తప్పించుకునే లక్ష్యంతోనే తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.