ఆస్తి ఉందని చూపిస్తే... రాసిచ్చేస్తా
- కుమారస్వామి ఆరోపణలపై మండిపడ్డ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : కెంగేరి ప్రాంతంలో తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి నిరూపించగలిగితే ఆయనకే రాసిచ్చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. కెంగేరి ప్రాంతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరులో ఆదివారం చేసిన ఆరోపణలపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందు సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి ఎంతమాత్రం తగదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇకమీదటైనా కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలని కుమారస్వామికి సూచించారు. ఇక ఇదే సందర్భంలో సిం గిల్ డిజిట్ లాటరీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని, అయినా ఇప్పటికీ ఈ వ్యవహారంపై కుమారస్వామి రాద్ధాం తం చేయడంలో ఏమాత్రం అర్థం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. సీబీఐ విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని, అప్పటి వరకు వేచి చూడాలని కుమారస్వామికి సూచించారు.