HDS
-
ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు. జీజీహెచ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌పై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా ఉన్నవి ఉన్నట్లు తెలియపచాలన్నారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ అందించిన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కోవిడ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో ఒంగోలులో ప్రత్యేకంగా వైద్య శాఖపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిమాండ్ తగినట్లుగా వైద్య సేవలు: కలెక్టర్ జీజీహెచ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే బాలినేనితో కలిసి హెచ్‌డీఎస్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రోగుల నమోదు నుంచి మందుల లభ్యత, రక్త నిల్వలు, వైద్య సిబ్బంది ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి తగ్గినందున ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు పెరిగాయన్నారు. నెలలో సుమారు 2 వేల మైనర్ ఆపరేషన్లు, 350 వరకు మేజర్ ఆపరేషన్లు జరగుతున్నాయన్నారు. హైరిస్క్ కేసులు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అవసరమైన మందులు 48 గంటల్లో సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుండి జీజీహెచ్‌కు అందుతున్నాయన్నారు. ఏవైనా కొన్ని మందులు అందుబాటులో లేకుంటే వాటిని హెచ్‌డీఎస్ నిధులతో ప్రైవేట్ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మందులు కాని రక్తం కాని రోగులకు భారం కాకుండా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యులను అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రవి, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందేనా..?
‘‘ చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని ఎంఎస్ వార్డులోని మొదటి అంతస్తు పరిస్థితి ఇది. చంటి బిడ్డలకు ఇబ్బందులున్నా, గర్భకోశ వ్యాధులతో బాధపడే మహిళల్ని ఇన్పేషెంట్లుగా అడ్మిట్ చేసుకుని వైద్య సేవలు అందించే చోట ఇలా కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో తెలియదు. చేతిలో ఉన్నవి, పడకలపై ఉన్నవాటిని దౌర్జన్యంగా లాక్కెళతాయి. పొరపాటున చిన్న పిల్లల్ని ఎత్తుకెళితే ఎవరు బాధ్యత వహిస్తారంటే అపోలో వద్దగానీ ప్రభుత్వ వైద్యుల వద్ద గానీ సమాధానం లేదు.’’ అలాగే‘‘ ఆసుపత్రిలో ఒకే ఒక్క జనరేటర్ మిషన్ ఉంది. 400 లీటర్ల కెపాసిటీ ఉన్న జనరేటర్లో కనీసం వంద లీటర్ల డీజల్ ఉండాలి. కానీ ఇప్పుడు 35 లీటర్లు మాత్రమే ఉంది. ఉన్నపలంగా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోతే 15 నిముషాలు మాత్రమే జనరేటర్ పనిచేస్తుంది. దాని తరువాత పరిస్థితి ఎలా..? అధికారుల మౌనమే సమాధానం.’’ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారింది. ఇక్కడ రోగులకు అగుగడుగునా ఇబ్బందులు ఎదురవు తుంటాయి. ఒకరు అపోలో వైపు విమర్శలు చేస్తుంటే.. మరొకరు ప్రభుత్వ వైద్యులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతిమంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల సమస్యలు చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది ఫిబ్రవరి 8న అప్పటి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నిర్వహించిన హెచ్‌డీఎస్ సమావేశమే ఆఖరు. దాదాపు 15 నెలల తరువాత బుధవారం ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలో కలెక్టర్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. అపోలో.. ప్రభుత్వ వైద్యుల్లో జవాబు దారీతనం తీసుకొస్తారని కలెక్టర్‌పై రోగులు ఆశలు పెట్టుకున్నారు. సమస్యలు కోకొళ్లలు.. ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఆర్నెళ్ల క్రితం అపోలో యాజమాన్యం సమకూర్చినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సీఎం చేత ప్రారంభో త్సవం చేయించాలన్న పట్టుదల రోగుల పాలిట శాపంగా మారింది. నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని 40కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు లేకపోవడంతో మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారు చికిత్స కోసం తిరుపతి, వేలూరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి 2డీ ఎకో పరికరాలతో పరీక్షలు చేయాలి. ఇది తిరుపతి, వేలూరు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంది. దీన్ని ఏర్పాటు చేయాలని ప్రస్తుత కలెక్టర్ ఆదేశించినా ఆ దిశగా పనులు జరగడంలేదు. ఇదేమిటని అడిగితే ఆసుపత్రిలో అసలు కార్డియో విభాగమే లేదన్నది ఇక్కడి వైద్యుల సమాధానం. ఆసుపత్రి కిటీకీలకు అద్దాలు వేయాలని, కోతుల బెడద నివారించడానికి మెస్ లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో తీర్మా నం చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. సమన్వలోపం సుస్పష్టం.. ఇటీవల ఆసుపత్రికి గర్భిణులు కాన్పుకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఆసుపత్రిలో మూడు పెద్ద ప్రాణాలతో పాటు ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటమే ఈ భయానికి కారణం. ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారులకు, అపోలో వైద్యాధికారులకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడంలేదు. పరిపాలన ప్రభుత్వ వైద్యాధికారుల చేతుల్లో ఉన్నా, తాము చెప్పిన పనులు ఇక్కడ జరగడంలేదన్నది వీరి వాదన. కాన్పుల వార్డులో ఇప్పటికీ రాత్రి విధులు ఎవరు చేయాలనేదానిపై ఇరువర్గాల్లోనూ స్పష్టత లేదు. -
షాక్ ట్రీట్మెంట్!
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ :సుమారు ఏడాదిగా కేంద్రాస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేయని అధికారులు.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలో కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఆస్పత్రికి సంబంధించిన టెండరుదారులంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో సమావేశంలో మళ్లీ వారినే కొనసాగించేలా హస్తం నేతలతో కలిసి...ప్రణాళిక రచించారు. అయితే ఈ విషయమై ఆదివారం ‘హస్తం నేతల లబ్ధికే..’ అన్న శీర్షికన ‘సాక్షి’లో కథనం రావడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. టెండర్ల విధానంలో నిబంధనల మేరకు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేయడంతో కేంద్రాస్పత్రి అధికారులు బిక్కముఖం వేశారు. సుమారు ఏడాది తరువాత కేంద్రాస్పత్రిలో సోమవారం సాయంత్రం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశం జరిగింది. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉండగా...అధికారులు 4 గంటలకు నిర్వహించారు. సమావేశంలో అధికార పార్టీ నేతలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను పొడిగించాలని అజెండాగా పెట్టారు. ఘోషా ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ,అంబులెన్సు, సైకిల్ స్టాండ్, కేంద్రాస్పత్రిలో క్యాంటీన్, ఘోషా ఆస్పత్రిలో క్యాంటీన్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలఖారు వరకు కొనసాగించాలని అధికారులు అజెండాలో పేర్కొన్నారు. అయితే దీనికి కలెక్టర్ అంగీకరించలేదు. వీటిన్నింటికి కొత్త టెండర్లు పిలవాలని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజును ఆదేశించారు. అలాగే కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రస్తుతం కొనసాగుతున్న 20 మంది ఉద్యోగులను కొనసాగించాలని అధికారులు అజెండాలో పెట్టారు. దీనికి కూడా కలెక్టర్ అంగీకరించలేదు. అరుుతే ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి జోక్యం చేసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తే...జీవనోపాధి కోల్పోతారని చెప్పడంతో కలెక్టర్ వారిని కొనసాగించడానికి అంగీకరించారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం హెచ్‌డీఎస్ నిధులను ఖర్చు చేసే విధానాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. చిన్న చిన్న మరమ్మతులకు కూడా ఈ నిధులను ఖర్చు చేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోషా ఆస్పత్రిలో గర్భిణులకు అవసరమైన ఎగ్జామినేషన్ టేబుళ్లు, ఆపరేషన్ థియేటర్లో లైట్లు తదితర వాటికి మాత్రమే నిధులను వినియోగించాలని సూచించారు. ఎంపీ ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ సదరం కార్యక్రమానికి వచ్చిన వికలాంగులకు ధ్రువీకరణ ఇవ్వడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వికలాంగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాకు ట్రామ్‌కేర్ సెంటర్ మంజూరైనట్టు చెప్పారు. అలాగే రూ.150 కోట్లతో వంద పడకల ఆస్పత్రి కూడా మంజూరైందన్నారు. కేంద్రాస్పత్రిలో వెంటిలేటర్లు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, బర్న్ వార్డులో ఏసీలు నిరంతరం పని చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనర్సయ్య, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ బి. విజయలక్ష్మి, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.