‘‘ చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని ఎంఎస్ వార్డులోని మొదటి అంతస్తు పరిస్థితి ఇది. చంటి బిడ్డలకు ఇబ్బందులున్నా, గర్భకోశ వ్యాధులతో బాధపడే మహిళల్ని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్ చేసుకుని వైద్య సేవలు అందించే చోట ఇలా కోతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పుడు వస్తాయో ఏం చేస్తాయో తెలియదు. చేతిలో ఉన్నవి, పడకలపై ఉన్నవాటిని దౌర్జన్యంగా లాక్కెళతాయి. పొరపాటున చిన్న పిల్లల్ని ఎత్తుకెళితే ఎవరు బాధ్యత వహిస్తారంటే అపోలో వద్దగానీ ప్రభుత్వ వైద్యుల వద్ద గానీ సమాధానం లేదు.’’ అలాగే‘‘ ఆసుపత్రిలో ఒకే ఒక్క జనరేటర్ మిషన్ ఉంది. 400 లీటర్ల కెపాసిటీ ఉన్న జనరేటర్‌లో కనీసం వంద లీటర్ల డీజల్ ఉండాలి. కానీ ఇప్పుడు 35 లీటర్లు మాత్రమే ఉంది. ఉన్నపలంగా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోతే 15 నిముషాలు మాత్రమే జనరేటర్ పనిచేస్తుంది. దాని తరువాత పరిస్థితి ఎలా..? అధికారుల మౌనమే సమాధానం.’’
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారింది. ఇక్కడ రోగులకు అగుగడుగునా ఇబ్బందులు ఎదురవు తుంటాయి. ఒకరు అపోలో వైపు విమర్శలు చేస్తుంటే.. మరొకరు ప్రభుత్వ వైద్యులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతిమంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల సమస్యలు చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది ఫిబ్రవరి 8న అప్పటి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నిర్వహించిన హెచ్‌డీఎస్ సమావేశమే ఆఖరు. దాదాపు 15 నెలల తరువాత బుధవారం ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలో కలెక్టర్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించనున్నారు. అపోలో.. ప్రభుత్వ వైద్యుల్లో జవాబు దారీతనం తీసుకొస్తారని కలెక్టర్‌పై రోగులు ఆశలు పెట్టుకున్నారు.
సమస్యలు కోకొళ్లలు..
ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఆర్నెళ్ల క్రితం అపోలో యాజమాన్యం సమకూర్చినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సీఎం చేత ప్రారంభో త్సవం చేయించాలన్న పట్టుదల రోగుల పాలిట శాపంగా మారింది. నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని 40కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు లేకపోవడంతో మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారు చికిత్స కోసం తిరుపతి, వేలూరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి 2డీ ఎకో పరికరాలతో పరీక్షలు చేయాలి. ఇది తిరుపతి, వేలూరు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంది. దీన్ని ఏర్పాటు చేయాలని ప్రస్తుత కలెక్టర్ ఆదేశించినా ఆ దిశగా పనులు జరగడంలేదు. ఇదేమిటని అడిగితే ఆసుపత్రిలో అసలు కార్డియో విభాగమే లేదన్నది ఇక్కడి వైద్యుల సమాధానం. ఆసుపత్రి కిటీకీలకు అద్దాలు వేయాలని, కోతుల బెడద నివారించడానికి మెస్ లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో తీర్మా నం చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు.
సమన్వలోపం సుస్పష్టం..
ఇటీవల ఆసుపత్రికి గర్భిణులు కాన్పుకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఆసుపత్రిలో మూడు పెద్ద ప్రాణాలతో పాటు ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటమే ఈ భయానికి కారణం. ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారులకు, అపోలో వైద్యాధికారులకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడంలేదు. పరిపాలన ప్రభుత్వ వైద్యాధికారుల చేతుల్లో ఉన్నా, తాము చెప్పిన పనులు ఇక్కడ జరగడంలేదన్నది వీరి వాదన. కాన్పుల వార్డులో ఇప్పటికీ రాత్రి విధులు ఎవరు చేయాలనేదానిపై ఇరువర్గాల్లోనూ స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment