పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది చిత్తూరు ప్రభుత్వాస్పత్రి తీరు. పేరుకు కార్పొరేట్ సంస్థ అపోలో ఇక్కడ ఉందనడమే తప్ప నిజంగా ఆ స్థాయిలో వైద్య సేవలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా రోగుల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి.
చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని బయటి నుంచి చూస్తే మార్పులు చేసినట్లు కనిపిస్తున్నా అత్యవసర సమయంలో వైద్యం కోసం వచ్చే సామాన్యుడికి మెరుగైన సేవలు అందడంలేదు. ఇక్కడి వైద్య సేవలను కార్పొరేట్ సంస్థ అపోలోకు అప్పగించినా ప్రభుత్వ వైద్యులు, ఆ సంస్థ వైద్యాధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు.ప్రభుత్వ వైద్యులు సొంత ఆస్పత్రులపై చూపే శ్రద్ధ దీనిపై పెట్టడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
గణాంకాలు భేష్..
చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నిర్వహణ భాద్యతల నుం చి ప్రభుత్వం పక్కకు తప్పుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పీపీపీ) మోడ్ కింద అపోలో సంస్థలకు 33 ఏళ్లపా టు లీజుకు ఇవ్వడం తెలిసిందే. అప్పటి వరకు రోజుకు 900 మంది ఉన్న అవుట్ పేషెంట్ల సంఖ్య 2,400కు చేరుకుంది. 350 పడకలకుగానూ 300 మంది వరకు ఇన్‌పేషంట్లుగా ఉన్నారు. అయినా సరే అర్ధరాత్రులు అత్యవసర సేవలు అందడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. నిన్నటికినిన్న ఒకేసారి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుండె, ఊపిరితిత్తులు తదితర ప్రత్యేక ఐసీయూ యూనిట్లు ఉన్నా వాటిల్లో సరైన సిబ్బంది లేరనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.
విభాగాలు వెలవెల..
చిత్తూరు ఆస్పత్రిలో ఆర్థో, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, గైనిక్, చిన్నపిల్లల విభాగాలతో పాటు కార్డియో, జనరల్ సర్జన్ లాంటి ఐసీయూలు సైతం ఉన్నాయి. వైద్యవిధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) కింద ఇక్కడ వైద్యులతో కలిపి 200 మంది వరకు ఉన్నారు. అపోలో సంస్థల నుంచి మరో 150 మంది వరకు ఉన్నారు. మెడికల్ సూపరింటెండ్ నుంచి, ప్రాంతీయ వైద్యాధికారి లాంటి కీలక పోస్టులు ఇన్‌చార్జ్‌లతో ఉండటంతో పర్యవేక్షణ కొరవడింది. రేడియాలజీ, ఆర్థో విభాగాధిపతుల పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారికి చికిత్స అందించడం రిస్క్‌గా భావించి వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ చేస్తున్నారు.
ఎవరిష్టం వారిది..
ఆస్పత్రిలో రోజుకు ఎందరు వైద్యులు వస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారనే పర్యవేక్షణ ఉండడం లేదు. ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్‌ఎంవో)కి రికార్డుల్లో ఉన్న అపోలో డాక్టర్లు, సిబ్బంది కనిపించకుంటే ఎవర్ని అడగాలో తెలియదు. రాత్రిపూట అపోలో వైద్యులు స్టే డ్యూటీ చేయాల్సింటే ‘మీరెవరు మాకు చెప్పడానికి..’ అంటుంటారు. దీనిపై ప్రభుత్వ వైద్యులు డీసీహెచ్‌ఎస్, ఎంఎస్‌లకు రాత పూర్వక ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం. పేరుకు పరిపాలన ప్రభుత్వ వైద్యాధికారులకే ఉన్నా పెత్తనం మొత్తం అపోలో చేతుల్లో ఉందని వైద్యవిధాన్ పరిషత్ అధికారులు అందరిముందే చెబుతున్నారు. అపోలో వైద్యులు రావడంతో ఇన్నేళ్లు తాము పడుతున్న కష్టానికి కొద్దిగా విశ్రాంతి వస్తుందని భావించిన ప్రభుత్వ వైద్యాధికారుల్లో జవాబుదారీతనం కొరవడిందనే చెప్పాలి. ఇక్కడ పనిచేసే 90 శాతం వైద్యుల్లో కొందరు సొంతంగా ఆస్పత్రులు పెట్టుకుంటే, మరికొందరు క్లినిక్స్‌లో ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఇందులో అపోలో వైద్యులకు మినహాయింపు లేదు.
ఫలితం సామాన్యులపై..
వైద్యాధికారుల్లో సమన్వయ లోపం ఆస్పత్రికి వచ్చే రోగులపై చూపిస్తోంది. కొన్ని విభాగాలను ఇప్పటికే యూనిట్–1, యూనిట్–2గా విభజించేశారు. వైద్యులు అందర్నీ చూడాల్సిన అవసరం లేదని యూనిట్లకు పరిమితం చేశారు. కాన్పుల వార్డుల్లో స్టేయింగ్ డ్యూటీ చేసేవారు లేకపోవడంతో హైరిస్క్‌తో వస్తున్న గర్భిణుల నాడి పట్టేవాళ్లు కనిపించడలేదు. ఫలితంగా రోగులకు ప్రాణం పోయాల్సిన బంగారు ఘడియలు (గోల్డెన్ హవర్) దుర్వినియోగమవుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంఎన్‌ఓ, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం లాంటి 40కు పైగా పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కలెక్టర్ కలుగజేసుకుని అపోలో, ప్రభుత్వ వైద్యులను ఓ గాడిలోకి తీసుకురావడంతో పాటు ఖాళీల భర్తీకి చర్యలు చేపడితే గాని ప్రజలకు నమ్మకం ఏర్పడే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment