ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేస్తున్న గర్భిణి శాంతకుమారి
చిత్తూరు, మదనపల్లె టౌన్ : ప్రసవనొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో నరకయాతన అనుభవించింది. సహనం కోల్పోయిన బాధితురాలు చివరకు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువణ్నామలైకి చెందిన సుబ్రమణ్యం తన భార్య శాంతకుమారి(34)ని వెంట తీసుకుని కూలిపనుల నిమిత్తం ఆంధ్రాకు వచ్చాడు. ములకల చెరువు మండలంలో వేరుశనగ పంట ఒబ్బిడి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న భార్య శాంతకుమారికి సోమవారం ప్రసవనొప్పులు రావడంతో 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యులు ఆమెను పరీక్షించారు.
ఆయాసం అధికంగా ఉండడంతో ఇక్కడ సరిౖయెన వైద్య సదుపాయాలు లేవని, తిరుపతికి వెళ్లాలని సూచించారు. వారి వద్ద చార్జీలకు కూడా డబ్బులు లేవని డాక్టర్లకు చెప్పారు. రిస్కు కేసు కావడంతో అడ్మిట్ చేసుకోవడానికి డాక్టర్లు, సిబ్బంది నిరాకరించారు. దీంతో వారు చేసేది లేక ఆస్పత్రి ఆవరణలోనే రాత్రంతా గడిపారు. ఓ వైపు శాంతకుమారి ప్రసవ నొప్పులతో కన్నీరు పెడుతుంటే, ఆమె భర్తకు ముగ్గురు పిల్లలను ఓదార్చడం కష్టంగా మారింది. తాను చనిపోయినా పర్వాలేదు.. ఆస్పత్రిలో చేర్పించుకోవాలని సిబ్బంది, సూపరింటెండెంట్‌ను బతిమలాడినా పట్టించుకోలేదు. దీంతో ఆమె సహనం కోల్పోయి మంగళవారం ఆస్పత్రి అత్యవసర విభాగం వద్ద తన ముగ్గురు పిల్లలు, భర్తతో కలసి ధర్నాకు పూనుకుంది. విషయం తెలుసుకున్న బాస్ నాయకులు శ్రీచందు తదితరులు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. ఆస్పత్రి వద్ద రోడ్డుపై బైటాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని, చందాలు వేసుకుని శాంతకుమారిని ప్రయివేటు అంబులెన్స్‌లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను తోడుగా బెట్టి తిరుపతి రుయాకు తరలించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment