షాక్ ట్రీట్‌మెంట్! | Shock Treatment | Sakshi
Sakshi News home page

షాక్ ట్రీట్‌మెంట్!

Published Tue, Feb 25 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

Shock Treatment

 విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ :సుమారు ఏడాదిగా కేంద్రాస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేయని అధికారులు.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలో కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఆస్పత్రికి సంబంధించిన టెండరుదారులంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో సమావేశంలో మళ్లీ వారినే కొనసాగించేలా హస్తం నేతలతో కలిసి...ప్రణాళిక రచించారు. అయితే ఈ విషయమై ఆదివారం ‘హస్తం నేతల లబ్ధికే..’ అన్న శీర్షికన ‘సాక్షి’లో కథనం రావడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. టెండర్ల విధానంలో నిబంధనల మేరకు వ్యవహరించాలని ఆయన స్పష్టం చేయడంతో కేంద్రాస్పత్రి అధికారులు బిక్కముఖం వేశారు. 
 
 సుమారు ఏడాది తరువాత కేంద్రాస్పత్రిలో సోమవారం సాయంత్రం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశం జరిగింది.  వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉండగా...అధికారులు 4 గంటలకు నిర్వహించారు. సమావేశంలో అధికార పార్టీ నేతలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను పొడిగించాలని అజెండాగా పెట్టారు. ఘోషా ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, కేంద్రాస్పత్రిలో సెక్యూరిటీ,అంబులెన్సు, సైకిల్ స్టాండ్, కేంద్రాస్పత్రిలో క్యాంటీన్, ఘోషా ఆస్పత్రిలో క్యాంటీన్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలఖారు వరకు కొనసాగించాలని అధికారులు అజెండాలో పేర్కొన్నారు. అయితే దీనికి కలెక్టర్ అంగీకరించలేదు. వీటిన్నింటికి కొత్త టెండర్లు పిలవాలని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజును ఆదేశించారు. అలాగే కేంద్రాస్పత్రి, ఘోషా ఆస్పత్రి విభాగాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రస్తుతం కొనసాగుతున్న 20 మంది ఉద్యోగులను కొనసాగించాలని అధికారులు అజెండాలో పెట్టారు. దీనికి కూడా కలెక్టర్ అంగీకరించలేదు. అరుుతే ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి జోక్యం చేసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తే...జీవనోపాధి కోల్పోతారని చెప్పడంతో కలెక్టర్ వారిని కొనసాగించడానికి అంగీకరించారు.
 
 అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
 హెచ్‌డీఎస్ నిధులను ఖర్చు చేసే విధానాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. చిన్న చిన్న మరమ్మతులకు కూడా ఈ నిధులను ఖర్చు చేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోషా ఆస్పత్రిలో గర్భిణులకు అవసరమైన ఎగ్జామినేషన్ టేబుళ్లు, ఆపరేషన్ థియేటర్‌లో లైట్లు తదితర వాటికి మాత్రమే నిధులను వినియోగించాలని సూచించారు. ఎంపీ ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ సదరం కార్యక్రమానికి వచ్చిన వికలాంగులకు ధ్రువీకరణ ఇవ్వడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వికలాంగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాకు ట్రామ్‌కేర్ సెంటర్ మంజూరైనట్టు చెప్పారు. అలాగే రూ.150 కోట్లతో వంద పడకల ఆస్పత్రి కూడా మంజూరైందన్నారు. కేంద్రాస్పత్రిలో వెంటిలేటర్లు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, బర్న్ వార్డులో ఏసీలు నిరంతరం పని చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనర్సయ్య, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్ బి. విజయలక్ష్మి, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement