headscarf
-
తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే పర్యటన!
రియాద్: జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే సౌదీ అరేబియా పర్యటనకు రావడం గమనార్హం. పశ్చిమ నగరం జెడ్డాలో ఆమెకు సౌదీ రాజు సల్మాన్, ఇతర అధికారులు సోమవారం స్వాగతం పలికారు. ఇంధన సంపన్న దేశమైన సౌదీతో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం మెర్కెల్ సౌదీ పర్యటనకు వచ్చారు. ఇటీవల సౌదీకి వచ్చిన పలువురు విదేశీ మహిళా ప్రముఖులు తలపై స్కార్ఫ్ కప్పుకొని దేశ సంప్రదాయాన్ని పాటించారు. ఇస్లామిక్ సంప్రదాయవాద దేశమైన సౌదీలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. మహిళలు బయటకు వచ్చినప్పుడు తలనుంచి అరికాళ్ల వరకు కనిపించకుండా దుస్తులు లేదా, బురఖా ధరించాలి. వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్ ధరించాలి. సంరక్షకుడు లేకుండా బయటకు వెళ్లకూడదు. వాహనాలు నడపడంపై నిషేధం ఉంటుంది. అయితే, విదేశీ సందర్శకులకు ఈ ఆంక్షలు వర్తించబోవు. గతంలో సౌదీ పర్యటనకు వచ్చిన థెరిస్సా మే, హిల్లరీ క్లింటన్, మిషెల్లీ ఒబామా సైతం తలపై స్కార్ఫ్ ధరించలేదు. సౌదీలో అణచివేతకు గురవుతున్న మహిళలకు మద్దతుగా తాను స్కార్ఫ్ ధరించడం లేదని గతంలో ఆ దేశ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని మే పేర్కొన్నారు. -
స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని..చచ్చిపో!
వాషింగ్టన్: అమెరికాలో ఓ 24 ఏళ్ల ముస్లిం ఉపాధ్యాయురాలికి చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో ఇక ఎంతమాత్రం హిజాబ్‌ను అంగీకరించబోమని, కాబట్టి స్కార్ఫ్‌ను మెడకు చుట్టుకొని ఉరేసుకొని చచ్చిపో అంటూ ఆమెకు బెదిరింపు లేఖ వచ్చింది. జార్జియా అట్లాంటాలోని గ్విన్నెట్ కౌంటీలో ఉన్న డకులా హై స్కూల్లో మిర్హా టెలి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ‘టెమి, ఇక నీ తలపై వేసుకొనే వస్త్రాన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. ఎందుకు నువ్వు దానిని మెడకు చుట్టుకొని ఉరేసుకోవు’ అంటూ నల్లసిరాతో ఓ లేఖ ఆమెకు వచ్చింది. దీనిపై అమెరికా అని సంతకం చేసి ఉంది. ‘ఒక ముస్లింగా నా మతవిశ్వాసం ప్రకారం నేను తలపై వస్త్రాన్ని ధరిస్తాను. మా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, నిజాల్ని తెలిపేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను దీనిని షేర్ చేసుకుంటున్నాను. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్ల అమెరికా మళ్లీ గొప్ప దేశం కాబోదు’ అని ఆమె తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. మరోవైపు ఆమెకు వచ్చిన బెదిరింపు లేఖపై విచారణ జరుపుతున్నట్టు స్థానిక పాఠశాల తెలిపింది.