తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే పర్యటన!
రియాద్: జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే సౌదీ అరేబియా పర్యటనకు రావడం గమనార్హం. పశ్చిమ నగరం జెడ్డాలో ఆమెకు సౌదీ రాజు సల్మాన్, ఇతర అధికారులు సోమవారం స్వాగతం పలికారు. ఇంధన సంపన్న దేశమైన సౌదీతో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం మెర్కెల్ సౌదీ పర్యటనకు వచ్చారు.
ఇటీవల సౌదీకి వచ్చిన పలువురు విదేశీ మహిళా ప్రముఖులు తలపై స్కార్ఫ్ కప్పుకొని దేశ సంప్రదాయాన్ని పాటించారు. ఇస్లామిక్ సంప్రదాయవాద దేశమైన సౌదీలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. మహిళలు బయటకు వచ్చినప్పుడు తలనుంచి అరికాళ్ల వరకు కనిపించకుండా దుస్తులు లేదా, బురఖా ధరించాలి. వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్ ధరించాలి. సంరక్షకుడు లేకుండా బయటకు వెళ్లకూడదు. వాహనాలు నడపడంపై నిషేధం ఉంటుంది. అయితే, విదేశీ సందర్శకులకు ఈ ఆంక్షలు వర్తించబోవు. గతంలో సౌదీ పర్యటనకు వచ్చిన థెరిస్సా మే, హిల్లరీ క్లింటన్, మిషెల్లీ ఒబామా సైతం తలపై స్కార్ఫ్ ధరించలేదు. సౌదీలో అణచివేతకు గురవుతున్న మహిళలకు మద్దతుగా తాను స్కార్ఫ్ ధరించడం లేదని గతంలో ఆ దేశ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని మే పేర్కొన్నారు.