The healing
-
రోగాల పంజా!
సంతకవిటి మండలంపై రోగాలు దాడి చేశాయి. కృష్ణంవలసలో విషజ్వరాలు ప్రబలగా, పోతు రాజుపేటలో డయేరియా విజృంభించింది. దీంతో పలువురు మంచం పట్టారు. సంతకవిటి : కృష్ణంవలస గ్రామంలో విష జ్వరాలు ప్రబలాయి. జ్వరాలు విజృంభించి వారం కావస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడం, వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వంజరాపు సుహాసిని, చిన్నప్పమ్మ, ఎస్.దుర్గమ్మ, రామకృష్ణ, వంకల దాలమ్మ, పాలిన వెంకమ్మ, పాపారావు, వంకల పాపమ్మ, వంకల సాయి, పిన్నింటి సూరమ్మ, లక్ష్మి, రాము, అంజలి, అసిరమ్మ తదితరులు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. వీరిలో కొంతమంది రాజాం, శ్రీకాకుళం వెళ్లి చికిత్స పొందుతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, కాళ్లు.. చేతులు పీకడంతో పాటు తలనొప్పి అధికంగా ఉంటుందని జ్వరపీడితులు చెబుతున్నారు. రోజురోజుకూ జ్వర పీడితులు పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచం పడుతున్నారు. స్థానికంగా వైద్యం అందకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా, ఆర్థికంగా ఉన్నవారు రాజాం, శ్రీకాకుళం ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామ రహదారి పూర్తగా పాడవ్వడంతో 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతురాజుపేటలో డయేరియా పోతురాజుపేట గ్రామంలో డయేరియా ప్రబలింది. టంకాల మహేశ్వరరావు, పోతురాజు యోగీశ్వరరావు, వేణునాయుడు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడు, డి.ల క్ష్మిలతో పాటు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో పోతురాజు, తవిటినాయుడు, కెల్ల అప్పలనాయుడుల పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం కుటుంబీకులు వీరిని ప్రైవేట్ వాహనంలో శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది స్పందించకపోవడంతో ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కృష్ణంవలస, పోతురాజుపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. -
మన్యంలో మంచి వైద్యం
అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య, ఆరోగ్య శాఖ పని చేస్తోందని కేఆర్ పురంలోని ఐటీడీఏ డెప్యూటీ డీఎంహెచ్‌వో వంశీలాల్ రాథోడ్ చెప్పారు. గిరిజన మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుకునూరు ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య సూచనలు అందజేస్తూ.. అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బుట్టాయగూడెం పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఇబ్బందులు, వైద్య సిబ్బంది పనితీరు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వంశీలాల్ రాథోడ్ రిపోర్టింగ్ ఇలా సాగింది. రాథోడ్ : ఏమ్మా.. మీది ఏ ఊరు. ఏ సమస్యతో పీహెచ్‌సీకి వచ్చారు. ఎస్.దుర్గమ్మ : మాది బుట్టాయగూడెం సార్. ఒకటే ఒళ్లు నొప్పులు. రాథోడ్ : డాక్టర్ గార్కి చూపించుకున్నారా. వైద్యం ఎలా చేశారు. ఎస్.దుర్గమ్మ : బాగానే చూశారు. ఇంజెక్షన్ చేసి మాత్రలు ఇచ్చారు. రాథోడ్ : ఏమ్మా.. పీహెచ్సీలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి పూరి సత్యవతి (బాలింత) : డాక్టరమ్మలు వైద్యం బాగానే చేస్తున్నారయ్యా. రాథోడ్ : నీకు రావమ్మా.. మహాలక్ష్మి పథకం గురించి తెలుసా! పూరి సత్యవతి : తెలుసండి. నరుసమ్మ చెప్పింది. రాథోడ్ : ఏం చంద్రరావ్.. ఆసుపత్రికి మళ్లీ వచ్చావేంటి. చంద్రరావు : దగ్గు తగ్గలేదు సార్. రాథోడ్ : డాక్టర్ గారూ.. రోగుల విషయంలో సిబ్బంది ఎలా ఉంటున్నారు. పి. మోజెస్, డాక్టర్ : మాతోపాటు సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు సార్. రోగులు వస్తే వెంటనే స్పందించి వారికున్న వ్యాధిని తెలుసుకుని తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాం సార్. రాథోడ్ : సుధా మేడమ్.. వైద్యం అనంతరం రోగులకు సూచనలు ఏమైనా ఇస్తున్నారా. పి.సుధ, డాక్టర్ : ఇస్తున్నాం సార్. వ్యాధి తీవ్రతను బట్టి వైద్య సేవలు అందిస్తున్నాం. పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నాం. జ్వరాలు, ఇత వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. రాథోడ్ : పని ఒత్తిడి ఎలా ఉంది. పి.కిరణ్, డాక్టర్ : పని ఒత్తిడి అధికంగా ఉంది సార్. స్టాఫ్‌ను నియమిస్తే బాగుంటుంది. రాథోడ్ : ఓకే. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పీహెచ్సీలలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం.