Healthcare Industry
-
ఆ రంగాలలో ఉద్యోగులకు భారీ డిమాండ్..!
ముంబై: నియామకాలు 2021 డిసెంబర్ నెలలో అంతకుముందు నెలతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. రిటైల్, ఆగ్రో ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగులకు పెరిగిన డిమాండ్ ఇందుకు తోడ్పడింది. ఈ వివరాలను ‘మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్’ నివేదిక ప్రకటించింది. ఈ రెండు పరిశ్రమల్లో నియామకాలు 2020 డిసెంబర్‌తో పోలిస్తే 12 శాతం పుంజుకున్నట్టు తెలిపింది. నెలవారీగా చూస్తే డిసెంబర్లో హెల్త్‌కేర్ రంగంలో 6 శాతం మేర నియామకాలు పెరిగాయి. కరోనా కేసులు పెరగడం ఈ రంగంలో నియామకాలకు తోడ్పడింది. అలాగే, హెచ్ఆర్, అడ్మిన్ విభాగాల్లో నియామకాలు కూడా 5 శాతం పెరిగాయి. ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో 4 శాతం వృద్ధి కనిపించింది. ఆరంభ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలకు డిమాండ్ డిసెంబర్లో 2 శాతం పెరిగింది. ఎఫ్ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో 7 శాతం, ప్రింటింగ్, ప్యాకేజింగ్‌లో 7 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో 5 శాతం చొప్పున నెలవారీగా ఉద్యోగుల నియామకం అధికంగా నమోదైంది. 2022పై అప్రమత్త ధోరణి అన్ని రంగాల్లోనూ భవిష్యత్తు రికవరీ పట్ల 2021 డిసెంబర్ గణాంకాలు ఆశలు కల్పించాయని మాన్స్టర్ డాట్ కామ్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. అయితే, 2022లో ఉద్యోగ నియామకాలపై మహమ్మారి ప్రభావం దృష్ట్యా మాన్స్టర్ డాట్ కామ్ అప్రమత్త ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ఇక 2021 డిసెంబర్లో రియల్ ఎస్టేట్ రంగంలోనూ నియామకాలు 6 శాతం పెరిగాయి. బయోటెక్నాలజీ, పార్మా రంగాల్లో 4 శాతం, ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో 3 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ఈ రంగాల్లో క్షీణత టెలికం/ఐఎస్పీ రంగంలో 2021 డిసెంబర్లో 9 శాతం మేర నియామకాలు తక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగంలో 7 శాతం మేర నెలవారీగా తక్కువ నియామకాలు నమోదయ్యాయి. అలాగే, షిప్పింగ్, మెరైన్, లాజిస్టిక్స్, కొరియర్/ఫ్రైట్, ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెల్, టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో 1 శాతం చొప్పున క్షీణత కనిపించింది. హైదరాబాద్‌లో 4 శాతం వృద్ధి మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ 13 పట్టణాల్లో నియామకాలను పరిగణనలోకి తీసుకోగా, ఇందులో 11 పట్టణాల్లో ఆశావహ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో 4 శాతం, బెంగళూరులో 5 శాతం, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 4 శాతం, పుణెలో 3 శాతం, కోల్‌కతాలో, చెన్నై, కోచి, జైపూర్ నగరాల్లో 3 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ పట్టణాలు అన్నీ కూడా నవంబర్ నెలకు క్షీణత చూశాయి. -
‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే!
న్యూఢిల్లీ: దేశంలో వైద్య సదుపాయాల విస్తరణ కోసం తీసుకొచ్చిన ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’ లక్ష్యాలను సాధించాలని బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వైద్య సదుపాయాల విస్తరణ కీలకమైనది. వైద్య సదుపాయాలు మెరుగుపడడం అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడుతుంది. ఈ పథకం లక్ష్యాల మేరకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలి. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న చోటు దీన్ని మరింతగా చురుగ్గా అమలు చేయాలి. పరిశ్రమ భాగస్వాములు, బ్యాంకులు, ఆర్థిక సేవల విభాగం కలసికట్టుగా దీన్ని సాధించాలి’’ అంటూ మంగళవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో భాగంగా మంత్రి కోరారు. ఐటీలో టెక్నాలజీ వినియోగంపై సూచనలు ఆదాయపన్ను శాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తృతం చేసే విషయమై ఆలోచనలు పంచుకోవాలని ఆ శాఖ యువ అధికారులను మంత్రి కోరారు. అధికారులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. యవ అధికారులకు సీనియర్ అధికారులు మార్గదర్శనం చేయాలని సూచించారు. -
వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్
ఒకరికి ‘సమస్య’ పరిచయం అయింది. ఒకరికి ‘ఉత్సాహం’ తోడైంది. ఒకరికి ‘ఓటమి’ ఎదురైంది. ఒకరికి తన అనుభవమే పాఠం అయింది. ‘సమస్య’ ‘ఉత్సాహం’ ‘ఓటమి’ ‘పాఠం’... ఈ నాలుగు పదాల ప్రయోగశాలలో పుట్టిందే ఆరా హెల్త్‌కేర్. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్యనందా ఈ స్టార్టప్ కంపెనీకి సూత్రధారులు. ‘ఆరా’ అనే ఉమెన్–సెంట్రిక్ హెల్త్‌టెక్ కంపెనీ ద్వారా నాణ్యమైన హెల్త్‌కేర్–ప్రొడక్ట్స్, సేవలను మహిళలకు చేరువ చేస్తున్నారు.... సమాచారం తక్కువైతే జరిగే నష్టం మాట ఎలా ఉన్నా, అతి అయితే మాత్రం గందరగోళం ఏర్పడుతుంది. ‘ఏది వాస్తవం?’ ‘ఏది అవాస్తవం?’ అని తేల్చుకోవడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ సమస్యతో పాటు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్య సమస్యల గురించి గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో ముంబైలో చర్చించుకున్నారు అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్య నందా. వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్ కంపెనీ. శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేసిన అహిల్య మెహతా స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆన్లైన్ పర్సనల్ స్టైలింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్టైల్‌క్రాకర్’లో అసోసియేట్ ప్రొడక్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఒక స్వచ్ఛందసేవా సంస్థతో కలిసి రాజస్థాన్‌లోని ట్రైబల్ విలేజ్ కొట్రాలో పని చేస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్యసమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం వచ్చింది. యూఎస్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన మల్లిక సాహ్నికి ఎంటర్ ప్రెన్యూర్షిప్ అంటే అనురక్తి. ఎంటర్ ప్రెన్యూర్‌గా విజయబావుటా ఎగరేయాలనే ఆమె కలకు ‘ఆరా’తో అంకురార్పణ జరిగింది. ‘తరగతి గదిలో బిజినెస్ పాఠాలు వినడం వేరు, ఆచరణ వేరు’ అంటున్న మల్లిక ‘ఆరా’ స్టార్టప్ ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంది. ఇంజనీరింగ్ చేసిన ప్రగ్యా సాబు హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ ‘ఆస్కార్ హెల్త్’లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసింది. ఆ తరువాత కొన్ని స్టార్టప్ కంపెనీలు మొదలుపెట్టింది కాని అవేమీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే ‘మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే పట్టుదల తప్ప నిరాశను ఎక్కడా దరి చేరనివ్వలేదు. ‘మన హెల్త్‌కేర్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి ఒకప్పటి నా ఉద్యోగం ఉపకరించింది’ అంటుంది ప్రగ్యా. ఈ బృందంలో అందరికంటే చిన్నవయసు ఉన్న అమ్మాయి నవ్య నందా. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవరాలు ఈ నవ్య. డిజిటల్ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ గర్భనిరోధకం, లైంగిక ఆరోగ్యం... మొదలైన విషయాలు మాట్లాడుకోవడానికి, సమస్య గురించి చర్చించడానికి సంకోచించే వారు, ఇబ్బందికి గురయ్యేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు తమ సమస్యను చెప్పుకోవడానికి, పరిష్కారానికి ఆరా ఒక ఆత్మీయనేస్తంలా ఉండాలనుకున్నాం’ అంటుంది నందా. ఒకప్పుడు నందా కొన్ని మానసిక సమస్యలకు గురైంది. వాటి నుంచి త్వరగానే బయటపడింది. తన అనుభవాలనే పాఠాలుగా ఉపయోగించుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆరా’లో వైద్యనిపుణులు ధృవీకరించిన సమాచారం ఉంటుంది. మహిళలు తమకు సంబంధించిన ఆరోగ్యసమస్యల గురించి స్వేచ్ఛాయుతంగా చర్చించుకోవడానికి, వైద్యసలహాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్...వేదికల ద్వారా కమ్యూనిటీ మీటప్స్ నిర్వహిస్తున్న ఆరా ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అనే అరోగ్యసూత్రాన్ని ఆచరణ లో చూపడానికి ప్రయత్నిస్తుంది. ప్రతివారం సమాచారాన్ని అప్డేట్ చేస్తుంటారు. ‘షాప్’ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 140మంది నిపుణులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఈ స్టార్టప్. కాస్త సరదాగా ‘కరోనా మాకు మేలే చేసింది’ అంటున్నారు నలుగురు మిత్రులు. ‘అదెలా?’ అంటే – ‘కరోనా వల్లే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వల్లే మేము సమావేశం అయ్యాం. దీనివల్లే ‘ఆరా’కు అంకురార్పణ జరిగింది’ అంటున్నారు! -
మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు
ముంబై, సాక్షి: మళ్లీ యూరోపియన్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండటంతో తాజాగా హెల్త్‌కేర్ రంగం వెలుగులోకి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే యూస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో వైరస్ కొత్త రూపంలో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు ఓవైపు మార్కెట్లను దెబ్బతీస్తుంటే.. మరోపక్క ఔషధ కంపెనీలకు డిమాండ్‌ను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు కోవిడ్-19 కట్టడికి కొత్త ఏడాది(2021)లో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నప్పటికీ మరికొంత కాలం వైరస్ సంక్షోభం కొనసాగనున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా హెల్త్‌కేర్, ఫార్మా కౌంటర్లు జోరందుకున్నాయి. వెరసి బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 21,644 వద్ద, ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 12,870 సమీపంలోనూ సరికొత్త గరిష్టాలు చేరాయి. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 46,660కు చేరగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 13,662 వద్ద ట్రేడవుతోంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) షేర్ల జోరిలా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సిప్లా 2 శాతం బలపడి రూ. 810 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 817కు ఎగసింది. తొలుత రూ. 905ను తాకిన అరబిందో ప్రస్తుతం 1.2 శాతం పుంజుకుని రూ. 896 వద్ద కదులుతోంది. ఈ బాటలో లుపిన్ 1 శాతం పెరిగి రూ. 983 వద్ద, సన్ ఫార్మా 1 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో లుపిన్ రూ. 992 వద్ద, సన్ ఫార్మా రూ. 586 వద్ద గరిష్టాలకు చేరాయి. కాగా.. ఎక్స్‌బోనస్ నేపథ్యంలో వేలియంట్ ఆర్గానిక్స్ 3 శాతం పురోగమించి రూ. 3400 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,488 వరకూ బలపడింది. ఇక బీఎస్ఈలో నెక్టార్లైఫ్, సువెన్ ఫార్మా, జూబిలెంట్, మెట్రోపోలిస్, మార్క్సాన్స్, ఇండొకో, గ్లెన్‌మార్క్, లాల్‌పాథ్, ఆస్ట్రాజెనెకా, లారస్ ల్యాబ్స్ 10-1 శాతం మధ్య జంప్‌చేశాయి. -
హెల్త్‌కేర్ కౌంటర్లు ధూమ్‌ధామ్
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కేసులు దేశీయంగా తగ్గుముఖం పట్టడంతోపాటు.. సాధారణ జీవనానికి ప్రజలు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్-19కు ముందు స్థాయిలో తిరిగి ఆసుపత్రులు వివిధ ఆరోగ్య సేవలకు తెరతీయడం ప్రభావం చూపుతున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ యూనిట్లలో నాన్‌కోవిడ్ విభాగాలకు తిరిగి రోగుల తాకిడి పెరుగుతున్నట్లు కేర్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, దేశ విదేశాల నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు ఆర్డర్లు లభిస్తుండటం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా యాంటీవైరల్స్, యాంటీమలేరియా, యాంటీబయోటిక్స్ తదితర విభాగాలలో ఔషధాల విక్రయాలు పెరుగుతున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2 శాతంపైగా బలపడింది. 12,637 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. గత ఐదు రోజులుగా హెల్త్‌కేర్ ఇండెక్స్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం.. హైజంప్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫార్మా రంగ కౌంటర్లు పలు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఆర్తి డ్రగ్స్ 7 శాతం జంప్‌చేసి రూ. 803ను తాకగా.. ఎఫ్డీసీ లిమిటెడ్ 5.5 శాతం ఎగసి రూ. 365కు చేరింది. ఈ బాటలో డిష్‌మ్యాన్ కార్బొజెన్ 8.4 శాతం దూసుకెళ్లి రూ. 158 వద్ద, క్యాప్లిన్ ల్యాబ్ 5.5 శాతం లాభంతో రూ. 520 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో సింజీన్ ఇంటర్నేషనల్ 7.5 శాతం దూసుకెళ్లి రూ. 615 వద్ద కదులుతోంది. తొలుత రూ. 614ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక ఇంట్రాడేలో రూ. 172 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సీక్వెంట్ సైంటిఫిక్ 5 శాతం బలపడి రూ. 168 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీ బాట ప్రస్తుతం నాట్కో ఫార్మా 5 శాతం ఎగసి రూ. 962 వద్ద కదులుతోంది. తొలుత రూ. 996 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా గ్లెన్‌మార్క్ ఫార్మా 5.5 శాతం లాభంతో రూ. 531 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 542 వరకూ ఎగసింది. ఇతర దిగ్గజాలలో 3 శాతం లాభంతో సన్ ఫార్మా రూ. 586 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 5,55 వద్ద, లుపిన్ రూ. 957 వద్ద కదులుతున్నాయి. బయోకాన్, అరబిందో, ఆల్కెమ్ ల్యాబ్, సిప్లా, టొరంట్ ఫార్మా సైతం 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. -
ఫార్మా దూకుడు- రికార్డులే.. రికార్డులు
ప్రధానంగా హెల్త్‌కేర్ రంగానికి పెరిగిన డిమాండ్‌తో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో లారస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సైతం చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అంతేకాకుండా పలు ఇతర ఫార్మా రంగ షేర్లు 52 వారాల గరిష్టాలను చేరడం విశేషం! వివరాలు ఇలా.. జోరుగా హుషారుగా బీఎస్ఈలో హెల్త్‌కేర్ రంగ ఇండెక్స్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. 20,529ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఫార్మాస్యూటికల్ కౌంటర్లలో లారస్ ల్యాబ్స్ తొలుత 6.5 శాతం జంప్‌చేసి రూ. 1497 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 5.7 శాతం ఎగసి రూ. 1484 వద్ద ట్రేడవుతోంది. ఈ వారంలో లారస్ షేరు 18 శాతం బలపడగా.. కోవిడ్-19 కట్టడికి వీలుగా రష్యన్ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలకు సిద్ధపడుతున్న డాక్టర్ రెడ్డీస్ తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 5303కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 8.2 శాతం జంప్‌చేసి రూ. 5222 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లోనే ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం విశేషం! యమ స్పీడ్ హెల్త్‌కేర్ రంగ కౌంటర్లలో ప్రస్తుతం నాట్కో ఫార్మా 19 శాతం దూసుకెళ్లి రూ. 921 వద్ద, ఆర్పీజీ లైఫ్ 8 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో హెస్టర్ బయో 8 శాతం ఎగసి రూ. 1790ను తాకగా.. సువెన్ లైఫ్ 6 శాతం లాభంతో రూ. 55కు చేరింది. ఇతర కౌంటర్లలో లుపిన్ 6 శాతం బలపడి రూ. 1100 వద్ద, సిప్లా 6 శాతం పెరిగి రూ. 795 వద్ద, గ్రాన్యూల్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 384 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా న్యూలాడ్ ల్యాబ్స్ 5 శాతం పెరిగి రూ. 1181ను తాకగా.. జేబీ కెమికల్స్ 4.3 శాతం ఎగసి రూ. 1115కు చేరింది. కాగా. దివీస్ ల్యాబ్స్ 4.3 శాతం లాభంతో రూ. 3350 వద్ద, క్యాప్లిన్ పాయింట్ 4 శాతం వృద్ధితో రూ. 595 వద్ద, కేడిలా హెల్త్‌కేర్ 4 శాతం పుంజుకుని రూ. 409 వద్ద, వొకార్డ్ 3.6 శాతం పెరిగి రూ. 307 వద్ద, గ్లెన్‌మార్క్ 3.5 శాతం వృద్ధితో రూ. 510 వద్ద కదులుతున్నాయి. ఏడాది గరిష్టాలకు.. బీఎస్ఈలో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ 2.3 శాతం పెరిగి రూ. 745 వద్ద, లింకన్ ఫార్మా 2.5 శాతం పుంజుకుని రూ. 270 వద్ద, హికాల్ 3 శాతం ఎగసి రూ. 190 వద్ద, లుపిన్ రూ. 1111 వద్ద, న్యూలాండ్ ల్యాబ్స్ రూ. 1199 వద్ద 52 వారాల గరిష్టాలను అందుకున్నాయి. -
హెల్త్‌కేర్‌లో బెస్ట్ కెరీర్ ఆప్షన్స్
జాబ్ పాయింట్: ఆధునిక యుగంలో ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన విసృ్తతమవుతోంది. దీంతో హెల్త్‌కేర్ ఇండస్ట్రీ నూతన సాంకేతిక సొబగులద్దుకొని వేగంగా వృద్ధి చెందుతోంది. హెల్త్‌కేర్‌లోనూ ఎన్నో రంగాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో బెస్టు కెరీర్ ఆప్షన్‌గా మారనున్న కొన్ని రంగాలు.. డైటీషియన్: సమాజంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండడంతో డైటీషియన్లకు డిమాండ్ అధికమవుతోంది. బరువు తగ్గించుకోవడం ఎలా? పెంచుకోవడం ఎలా? ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి విషయాలు తెలుసుకొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో సందేహాలు తీర్చి, ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి.. డైటీషియన్. ఒకప్పుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలోనే డైటీషియన్లు ఉండేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లోనూ వీరి సేవలు అందుతున్నాయి. డైటీషియన్ రంగాన్ని ఎంచుకుంటే ఆసుపత్రుల్లో పనిచేయడంతోపాటు సొంతంగానూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైటీషియన్లకు భారీ అవకాశాలున్నాయనేది నిపుణుల మాట. స్పోర్ట్స్ సైకాలజీ: సైకాలజీలోని ఒక స్పెషలైజేషన్ స్పోర్ట్స్ సైకాలజీ. నేటి యువత క్రీడలను తమ కెరీర్‌గా మలచుకుంటోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ సైకాలజిస్టులకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ అకాడమీల్లో క్రీడాకారులకు మానసికంగా మెరికలుగా తీర్చిదిద్దడం, వారిని ఆటకు సంసిద్ధులను చేయడం వీరి బాధ్యత. భారత క్రీడారంగంలోకి కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ క్రీడా సంస్థలు కూడా ప్రవేశిస్తుండడంతో స్పోర్ట్స్ సైకాలజిస్టులు అవకాశాలు మరింత మెరుగువుతున్నాయి. స్పీచ్ థెరపీ: అభివృద్ధి చెందిన దేశాల్లో స్పీచ్ థెరపిస్టులకు భారీ డిమాండ్ ఉంది. వీరికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలున్నాయి. స్పీచ్ థెరపిస్టులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్పెషల్ స్కూల్స్, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేయొచ్చు. నిపుణులైన స్పీచ్ థెరపిస్టులు అమెరికా/యూకే/కెనడా నిర్వహించే అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే కెరీర్లో సులువుగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్: భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రొఫెషన్ హెల్త్‌కేర్ ట్రైనర్స్/ఎడ్యుకేటర్స్. ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే ట్రైనర్లకు మంచి డిమాండ్ ఉంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో వీరి అవసరం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. హెల్త్‌కేర్ ట్రైనర్లు ఆసుపత్రుల్లో సేవలందించడంతోపాటు స్వయం ఉపాధి పొందొచ్చు. హెల్త్‌కేర్ ఎడ్యుకేటర్ నైపుణ్యాలు పెంచుకొని, తగిన అనుభవం సంపాదిస్తే సూపర్వైజర్, సీనియర్ హెల్త్ ఎడ్యుకేటర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వంటి హోదాలను అందుకోవచ్చు. ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్: హెల్త్‌కేర్ రంగంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ట్రెండ్ ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. రోగులకు సంబంధించిన మెడికల్, ట్రీట్మెంట్ హిస్టరీని ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందించేవారే ఈ-హెల్త్ టెక్నోక్రాట్స్. వీరికి ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో టెక్నికల్ స్టాఫ్‌కు అధిక డిమాండ్ ఉంది. ఈ-హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.