ఆ రంగాలలో ఉద్యోగులకు భారీ డిమాండ్‌..! | Demand for healthcare professionals up 6 per cent in December | Sakshi
Sakshi News home page

ఆ రంగాలలో ఉద్యోగులకు భారీ డిమాండ్‌..!

Published Tue, Jan 18 2022 9:26 PM | Last Updated on Tue, Jan 18 2022 9:27 PM

Demand for healthcare professionals up 6 per cent in December - Sakshi

ముంబై: నియామకాలు 2021 డిసెంబర్‌ నెలలో అంతకుముందు నెలతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. రిటైల్, ఆగ్రో ఆధారిత పరిశ్రమల్లో ఉద్యోగులకు పెరిగిన డిమాండ్‌ ఇందుకు తోడ్పడింది. ఈ వివరాలను ‘మాన్‌స్టర్‌ ఎంప్లాయిమెంట్‌ ఇండెక్స్‌’ నివేదిక ప్రకటించింది. ఈ రెండు పరిశ్రమల్లో నియామకాలు 2020 డిసెంబర్‌తో పోలిస్తే 12 శాతం పుంజుకున్నట్టు తెలిపింది. నెలవారీగా చూస్తే డిసెంబర్‌లో హెల్త్‌కేర్‌ రంగంలో 6 శాతం మేర నియామకాలు పెరిగాయి. కరోనా కేసులు పెరగడం ఈ రంగంలో నియామకాలకు తోడ్పడింది. 

అలాగే, హెచ్‌ఆర్, అడ్మిన్‌ విభాగాల్లో నియామకాలు కూడా 5 శాతం పెరిగాయి. ఫైనాన్స్, అకౌంట్స్‌ విభాగాల్లో 4 శాతం వృద్ధి కనిపించింది. ఆరంభ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలకు డిమాండ్‌ డిసెంబర్‌లో 2 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ రంగంలో 7 శాతం, ప్రింటింగ్, ప్యాకేజింగ్‌లో 7 శాతం, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ రంగంలో 5 శాతం చొప్పున నెలవారీగా ఉద్యోగుల నియామకం అధికంగా నమోదైంది.  

2022పై అప్రమత్త ధోరణి 
అన్ని రంగాల్లోనూ భవిష్యత్తు రికవరీ పట్ల 2021 డిసెంబర్‌ గణాంకాలు ఆశలు కల్పించాయని మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ సీఈవో శేఖర్‌ గరీశ తెలిపారు. అయితే, 2022లో ఉద్యోగ నియామకాలపై మహమ్మారి ప్రభావం దృష్ట్యా మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ అప్రమత్త ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ఇక 2021 డిసెంబర్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ నియామకాలు 6 శాతం పెరిగాయి. బయోటెక్నాలజీ, పార్మా రంగాల్లో 4 శాతం, ఐటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో 3 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి.  

ఈ రంగాల్లో క్షీణత 
టెలికం/ఐఎస్‌పీ రంగంలో 2021 డిసెంబర్‌లో 9 శాతం మేర నియామకాలు తక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్‌/స్టీల్‌ రంగంలో 7 శాతం మేర నెలవారీగా తక్కువ నియామకాలు నమోదయ్యాయి. అలాగే, షిప్పింగ్, మెరైన్, లాజిస్టిక్స్, కొరియర్‌/ఫ్రైట్, ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెల్, టూరిజం, ఎడ్యుకేషన్‌ రంగాల్లో 1 శాతం చొప్పున క్షీణత కనిపించింది.  

హైదరాబాద్‌లో 4 శాతం వృద్ధి 
మాన్‌స్టర్‌ ఎంప్లాయిమెంట్‌ ఇండెక్స్‌ 13 పట్టణాల్లో నియామకాలను పరిగణనలోకి తీసుకోగా, ఇందులో 11 పట్టణాల్లో ఆశావహ పరిస్థితి కనిపించింది. హైదరాబాద్‌ మార్కెట్లో 4 శాతం, బెంగళూరులో 5 శాతం, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లోనూ 4 శాతం, పుణెలో 3 శాతం, కోల్‌కతాలో, చెన్నై, కోచి, జైపూర్‌ నగరాల్లో 3 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ పట్టణాలు అన్నీ కూడా నవంబర్‌ నెలకు క్షీణత చూశాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement