అందుబాటులోకి రానున్న కృత్రిమ హృదయం!
వయసు పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ... చాలామందికి తమ గుండె గురించే దిగులు. గుండె బలహీనమవుతుంటుంది. గుండె లయతప్పుతుంటుంది. గుండెపోటు వస్తుంది. ఇలాంటి ఎన్నెన్నో సమస్యలతో గుండె సతమతమవుతుంది. మరింకేదైనా అవయవానికి ఏదో కాస్త సుస్తీ చేస్తే పర్లేదేమో! కానీ... గుండెతో వచ్చిన ఇబ్బందల్లా... దానికి ఏ చిన్న సమస్య వచ్చినా శరీరమంతటికీ అవసరమైన ఆహారం, ఆక్సిజన్ ఆగిపోయి మరణానికే దారితీస్తుంది. అదీ సమస్య. మీరూ మీ గుండె గురించి ఇలాంటి చింతల్లో ఉన్నారా? నా గుండెకు కూడా లయతప్పడం, హార్ట్ ఫెయిల్యుర్ అవ్వడం, గుండెపోటు రావడం జరిగితే ఎలా అనుకుంటున్నారా? మీకో శుభవార్త! అత్యంత శుభప్రదమైన, అందమైన భవిష్యత్ దర్శనం ఇది. భవిష్యత్తులో గుండెకు సంబంధించిన ఎలాంటి జబ్బులు వచ్చినా... కొన్ని ఉపకరణాలూ, ఒక రకంగా చెప్పాలంటే కృత్రిమ గుండె వంటి పరికరాలతో ఎలాంటి అంతరాయమూ లేకుండా గుండెను ఎప్పటిలాగే పనిచేయించవచ్చు.
వయసు పెరుగుతున్న కొద్దీ 60 నుంచి 80 ఏళ్ల మధ్యవారిలో చాలామంది గుండె సమస్యలతోనే ఆసుపత్రుల్లో చేరుతుంటారు. హార్ట్ ఫెయిల్యూర్స్‌తో చాలామంది మరణిస్తుంటారు. అన్ని రకాల క్యాన్సర్లతో మృత్యువు బారిన పడేవారికంటే గుండె సమస్యతో చనిపోయేవారే ఎక్కువ. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి తారుమారవుతుందంటూ ఇప్పుడు భరోసా ఇవ్వగలుగుతున్నారు డాక్టర్లు.
గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకునే మందుగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే అది హార్ట్ ఎటాక్ కాదు. గుండెకు సంబంధించిన కండరాలు కాస్త కాస్త బలహీనమయిపోతూ, తమ విధులను నిర్వర్తించడంలో సమర్థతను కోల్పోవడాన్నీ హార్ట్ ఫెయిల్యూర్‌గా పేర్కొనవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్లో గుండెకు ఆక్సీజన్, పోషకాలు తక్కువగా అందే కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) ఉండవచ్చు, లేదా ఇన్ఫెక్షన్లు రావడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె కండరం బలహీనమైపోయిన ‘కార్డియోమయోపతి’ అనే కండిషన్ కావచ్చు, లేదా అందరూ తీవ్రంగా భావించే గుండెపోటు కూడా కావచ్చు. కానీ చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ అనగానే దాన్ని హార్ట్ అటాక్ (గుండెపోటు)గానే భావిస్తుంటారు. ఈ హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన సమస్యలను ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ (సీహెచ్ఎఫ్)గా పేర్కొనవచ్చు. ‘న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్’ (ఎన్వెహైచ్ఏ) ప్రకారం తీవ్రతల ఆధారంగా నాలుగు రకాల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అవి...
క్లాస్ - 1 (మైల్డ్): ఇందులో శారీరక శ్రమ వల్ల దేహానికి ఇబ్బందేమీ ఉండదు. అయితే తీవ్రంగా పనిచేసినప్పుడు అలసట, గుండెదడ, ఆయాసం ఉంటాయి. ఇవి మామూలు/సాధారణ ప్రజలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.
క్లాస్ - 2 (మైల్డ్): శారీరక శ్రమలో మామూలు కంటే అలసట ఎక్కువ. కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలైపోతారు. గుండెదడ, ఆయాసం ఉంటాయి.
క్లాస్ - 3 (ఒక మోస్తరు): ఇందులో కొద్దిపాటి శ్రమకే తీవ్రంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకుంటుంటేనే సౌకర్యంగా ఉంటారు. గుండెదడ, ఆయాసం తరచూ కనిపిస్తాయి.
క్లాస్ - 1 (తీవ్రమైన సమస్య): ఏమాత్రం శ్రమను భరించలేదు. కొద్దిగా కదిలితేనే తీవ్రమైన ఇబ్బందులూ ఆయాసం. ఒక్కోసారి చాలాసేపటి విశ్రాంతి తర్వాత కూడా మామూలుగా కాలేరు. గుండెదడ, ఆయాసం నిత్యం ఉంటాయి.
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (సీహెచ్ఎఫ్) మొదటి, రెండో దశలో పేషెంట్ ఉన్నప్పుడు మందులతోనే వారి పరిస్థితిని నయం చేయవచ్చు. ఇప్పటికే ఈ తరహా మందులు వాడుతున్నారు. ఒకవేళ వారి పరిస్థితి ముదిరి మూడు లేదా నాలుగో దశలో ఉంటే మాత్రం మందులతో పాటు భవిష్యత్తులో కొన్ని ఉపకరణాలతో వారి సమస్యలను దూరం చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే గతంలో చేయిదాటిపోయినాయి అనుకున్న కేసులను సైతం భవిష్యత్తులో ‘కృత్రిమ గుండె’ వంటి ఉపకరణాలతో పేషెంట్ ఎప్పటికీ గుండెపోటుతో మాత్రం మరణించకుండా కాపాడుకునే మంచి రోజులు ముందున్నాయి.
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌కు వాడే ఉపకరణాలు
ఒకవేళ గుండె పూర్తిగా ఫెయిల్ అయి తన బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే అప్పుడు కొన్ని ఉపకరణాలతో గుండెజబ్బులు ఉన్నవారు మళ్లీ యథావిధిగా సాధారణ జీవితం గడపవచ్చు. అలా గడపడానికి ఉపయోగపడే ఉపకరణమే వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైజ్ (వీఏడీ). ఈ ‘వీఏడి’ దాదాపుగా కృత్రిమ గుండె అనుకోవచ్చు.
వీఏడీ అంటే...?
ఇది ఒక మెకానికల్ పంపు వంటి సాధనం. గుండెలోని కింది గదులు (వెంట్రికల్స్) బలహీనం అయినప్పుడు అక్కడి నుంచి రక్తం వేగంగా పంప్ అయ్యేలా ఈ సాధనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూర్తిగా విఫలమైన గుండెను తొలగించి దాని స్థానంలో దాత నుంచి స్వీకరించే కొత్తగుండెను అమర్చడం అన్నది తక్షణం చేయాల్సిన పని. కానీ ‘వీఏడీ’ సహాయంతో కొత్త గుండె అమర్చడానికి కొంత సమయాన్నీ తీసుకోవడం వీఏడీ ద్వారా ఒనగూరే మరో సౌకర్యం. అందుకే దీన్ని ‘బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్’గా వ్యవహరిస్తారు. ఇక కొందరికి అసలు కొత్త గుండే దొరికే పరిస్థితే లేకపోతే దీన్నే శాశ్వత కృత్రిమ గుండెగా కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని ‘డెస్టినేషన్ థెరపీ’గా వ్యవహరిస్తారు. అంటే భవిష్యత్తులో గుండెపోటు వచ్చిందటే అది తప్పకుండా మరణమే అనే పరిస్థితి ఉండదు. జీవితానికి ఇంకా చాలా అవకాశం ఉంటుందనే అంశం... ఇప్పుడు నట్లమబ్బుల్లో కనిపించే మెరుపులాంటి ఆశారేఖ.
ఏయే భాగాలు ఫెయిలైతే ఏయే రకాల వీఏడీలు...
గుండెలోని ఎడమవైపు కింది గది విఫలం అయితే దీనికోసం ‘ఎల్వీఏడీ’ని, కుడివైపు కింది గది విఫలమైతే ‘ఆర్వీఏడీ’ని, ఇక రెండు గదులూ పనిచేయకపోతే ‘బైవీఏడీ’ అనే సాధనాలను వాడతారు.
వీఏడీలోని వివిధ భాగాలూ... అవి చేసే పనులు :
A. ఔట్ ఫ్లో ట్యూబ్: దీన్ని గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుపోయే ప్రధాన ధమనికి అమరుస్తారు.
B. ఇన్‌ఫ్లో ట్యూబ్: దీన్నే కాండ్యూయిట్ అని కూడా అంటారు. దీన్ని గుండె ఎడమవైపు కిందిగదికి అమర్చుతారు.
C. పవర్ సోర్స్: ఇది వీఏడీ ఉపకరణం పనిచేయడానికి అవసరమైన శక్తివనరును అందించే బ్యాటరీ.
D.పంప్ యూనిట్: ఇది రక్తం పంప్ అయ్యేందుకు ఉపయోగపడే భాగం.
E. డ్రైవ్‌లైన్: ఇది వీఏడీ ఉపకరణం దగ్గర మొదలై మన చర్మం నుంచి మన శరీరం బయటకు వచ్చే సాధనం. ఇది కొన్ని విద్యుత్కేబుళ్లను కలిగి ఉండి ఈ సాధనాన్ని నియంత్రిస్తూ ఉంటుంది.
F. ఎక్స్టర్నల్ కంట్రోలర్: ఇది శరీరం బయట ఉండే సాధనం. దీనికి వైర్లను కనెక్ట్ చేయడం ద్వారా వీఏడీ ఉపకరణం నడిచేందుకు అవసరమైన శక్తిని పంపడం లేదా బ్యాటరీతో అనుసంధానం వంటివి చేయడానికి పనికి వస్తుంది. ఇది ఒక కంప్యూటర్‌తో అనుసంధానమై వీఏడీ పనితీరు సక్రమంగా జరిగేలా నియంత్రిస్తుంటుంది. ఇది వీఏడీ పనితీరును ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండటమే కాకుండా, ఈ వీఏడీ పనితీరు వ్యవస్థలో ఏదైనా లోపం వస్తే హెచ్చరికలూ పంపుతుంది.
టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్)
పైన పేర్కొన్న వీఏడీ అన్నదే దాదాపు కృత్రిమ గుండెలా పనిచేసే సాధనమైతే... ఇక పూర్తిగా కృత్రిమగుండె అనదగ్గ మరో పరికరమే టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్). ఇప్పుడు గుండెజబ్బులు వాటి నివారణ, చికిత్స విషయంలో జరుగుతున్న పరిశోధనల వేగాన్ని అంచనా వేసుకుని భవిష్యత్ దర్శనం చేస్తే ఒకనాటికి గుండెజబ్బుల విషయంలో గుండెపోటు కారణంగానో లేదా గుండె పనితీరు లోపం వల్లనో సంభవించే మరణాలు దాదాపుగా ఉండకపోవచ్చు. కారణం... టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్). జార్విక్-7 అని కూడా పిలిచే దీన్ని మొదటిసారిగా బ్యార్నీ క్లార్క్ అనే 61 ఏళ్ల డెంటిస్ట్‌కు అమర్చి చూశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు లభ్యమవుతున్న టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్స్ బాగా పనిచేస్తున్నాయి. మరింత సమర్థమైనవి వస్తాయి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి