ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు.
బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు.
‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’,
‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’
వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది.
ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు.
ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది.
మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం.
ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది.
నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి.
– డా. ఎన్. అనంతలక్ష్మి