మీ గుండెకు వయసెంత..?
లండన్: గుండెకు వయసేమిటీ.. మనకెంతో దానికీ అంతే కదా. నిజమే కానీ.. గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే జీవనశైలి, ఇతర అంశాల ఆధారంగా గుండె ఎంత ఆరోగ్యంగా ఉందన్న దానిని బట్టి అది ఏ వయసులో ఉందన్నది తాము అంచనా వేస్తామంటున్నారు బ్రిటిష్ మెడికల్ సొసైటీల శాస్త్రవేత్తలు. గుండె వయసును లెక్కించడంతోపాటు అది ఎన్నేళ్లు పనిచేస్తుందో కూడా చెప్పగలిగే ‘జేబీఎస్3 రిస్క్ కాలిక్యులేటర్’ను రూపొందించామని వారు వెల్లడించారు. ఉదాహరణకు.. పొగతాగే అలవాటున్న 35 ఏళ్ల మహిళకు సిస్టోలిక్ బీపీ (పైన ఉండే సంఖ్య) 160 ఎంఎం హెచ్‌జీ, కొలెస్ట్రాల్ 7 మిల్లీమోల్స్/లీటర్ ఉన్నాయనుకుందాం. అప్పుడు రిస్క్ కాలిక్యులేటర్ అంచనా ప్రకారం.. ఆమె గుండె వయస్సు 47 అవుతుందట. జీవనశైలి, ఇతర అంశాలను బట్టి చూస్తే.. ఆమె గుండె 71 ఏళ్ల వయసు(గుండెది) దాటాకే గుండెపోటు, పక్షవాతం ముప్పు అధికంగా ఉంటుందట. తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండె వయస్సు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.