విశ్వవిద్యాలయం నుంచి వాస్తవ సేద్యానికి
ఆత్రేయపురంలో హార్టికల్చర్ విద్యార్థినుల ప్రాజెక్టు వర్క్
100 రోజుల పాటు అంతర పంటలపై క్షేత్రస్థాయి శిక్షణ
సాగు కృషిని వివరిస్తున్న అభ్యుదయ రైతు సత్యనారాయణరాజు
ఆత్రేయపురం :
ఉద్యాన సేద్యం గురించి ఇంతవరకూ పుస్తకాల పుటల్లోనూ, తరగతి గదుల్లోనూ మాత్రమే చదువుకున్న ఆ విద్యార్థినులు ఇప్పుడు.. పుడమి ఒడిలో రైతు స్వేదంతో, శ్రద్ధతో సాగే నిజమైన సేద్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. మట్టిలోకి వేళ్లూనిన మొక్క పండునో, పువ్వునో, పంటనో ఇచ్చే క్రమానికి దోహదం చేసే కృషిని స్వయంగా చూస్తున్నారు. విశ్వ విద్యాలయం నేర్పిన విజ్ఞానానికి మట్టిపుటలే సానరాయిగా పదును పెట్టుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీకీ చెందిన ఆరుగురు విద్యార్థినులు కోనసీమలో క్షేత్రస్థాయి తర్ఫీదు (ప్రాజెక్టు వర్క్) పొందుతున్నారు. అంతరపంటలపై 100 రోజుల తర్ఫీదుకు స్థానిక అభ్యుదయ రైతు ముదునూరి సత్యనారాయణరాజు వ్యవసాయ క్షేత్రం వేదికైంది. ఉద్యానవన శాఖ అధికారిణి బబిత వారి ప్రాజెక్ట్ వర్క్‌కు తన వంతు సహకరిస్తూ చేదోడుగా నిలుస్తున్నారు. అరటి, పసుపు , కాబేజీ, బంతి, కోకో, బొప్పాయి వంటి పంటల సాగులపై అవగాహన కల్పిస్తున్నారు. ఏసీ రూముల్లో చల్లగా, కడుపులో చల్లకదలకుండా చేసుకునే ఉద్యోగాలను తెచ్చే చదువును కాక, మట్టికీ, మొక్కకూ, ప్రకృతికీ చేరువగా ఉండే కొలువుల్ని ఇచ్చే కోర్సును ఎంచుకున్న ఆ యువతులు.. చదువుకు, క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని జోడించి, భవిష్యత్తులో పచ్చదనానికీ, ‘ఫల’సాయానికీ శక్తి మేరకు దోహదపడతామంటున్నారు.
మెళకువలు వివరిస్తున్నా..
వ్యవసాయ రంగంలో స్థిరపడాలని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయులకు మా పొలంలో పండిస్తున్న పంటల సాగులో మెళకువలు వివరిస్తున్నాను. నా చిన్ననాటి నుంచీ వ్యవసాయ రంగం అంటే ఎంతో ఇష్టం. స్థానిక వ్యవసాయ అధికారులు ఈ విద్యార్థులను నా వద్దకు పంపించారు. నేను సాగు చేస్తున్న పంటలకు సంబంధించి తర్ఫీదు ఇస్తున్నాను.
– ముదునూరి సత్యనారాయణరాజు, అభ్యుదయ రైతు, ఆత్రేయపురం
ఈ రంగంలో విజయం సాధిస్తా..
మనం ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లాలంటే ఒక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం కోసం పని చేస్తూ ముందుకు వెళితే అనుకున్న విజయాన్ని సాధించగలుగుతాం. హార్టికల్చర్ రంగంలో విజయం సాధించి ముందుకు వెళతా.
– డి. శ్రీ విద్య, ఒంగోలు
రైతు కష్టం కళ్లారా చూశాం
విత్తునాటి , నీళ్లు పోసి పంట పండిస్తున్న రైతు కష్టం కళ్లారా చూశాం. నేను చదివిన ఈ చదువు ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరపడి, ఎన్నో ప్రయోగాలు చేసి రైతులకు మేలు చేకూరేందుకు నా వంతు ప్రయత్నిస్తా.
– కె.సుధారాణి , శ్రీకాకుళం
ఉద్యానకృషిలో రాణిస్తా..
అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండాలి. వారు ఉన్నత చదువులు అభ్యసించి తను ఎంపిక చేసుకున్న వృత్తిలో రాణించిననాడే సమాజం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లుతుంది. ఉద్యానకృషిలో రాణించాలన్నదే నా లక్ష్యం.
– కె.శ్రీప్రియ, పార్వతీపురం
ఈ శిక్షణ విలువైనది
మహిళలు వ్యవసాయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకూ ఉద్యానకృషిపై మొక్కవోని దీక్షతో యూనివర్సిటీలో విద్యాభ్యాసం సాగించాం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పొందుతున్న ఈ శిక్షణ ఎంతో విలువైనది.
– ఐవీఎస్ పావని, బొబ్బిలి
మంచి ఉద్యోగం సాధిస్తా..
ఎంతో కష్టపడి హార్టికల్చర్ కోర్సును పూర్తి చేశాం. మరిన్ని మెళకువలు తెలుసుకునేందుకు పంట పొలాలకు వెళ్లి రైతుల నుంచి శిక్షణ పొందుతున్నాం. అన్నం పెట్టే రైతు నుంచి సాగులో ఎంతో నేర్చుకుంటున్నాం. మంచి ఉద్యోగం సాధిస్తా.
– కె.స్రవంతి, నర్సీపట్నం
కోనసీమ కనువిందుగా ఉంది
కోనసీమలో పంటలకు అనువైన గ్రామాలు ఉన్నాయి. చుట్టూ గోదావరి ఎంతో అనందాన్ని ఇస్తోంది. రైతులు విత్తనం నాటి, ఎంతో కృషిచేసి పంటలు పండించే విధానాన్ని కళ్లారా చూశాం. ఈ రంగంలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తా.
– బి. సింధుజ, విశాఖ