1,650 డిగ్రీలంటే మాడిపోవడమే...
ఇదేదో సినిమాల్లోని గ్రాఫిక్ సీన్ కాదు... అచ్చంగా నిజమైనదే.. 1,650 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూరీడులా భగభఘ మండుతున్న లావాకు ఇంత దగ్గరగా వెళ్లడమంటే మాటలు కాదు మరీ. అయితే...అమెరికాలోని జార్జియాకు చెందిన ఫిల్మ్ మేకర్, సాహసికుడు శామ్ క్రాస్మన్ బృందం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మ జీవులు ఎలా మనుగడ సాగిస్తాయనే అంశంపై పరిశోధనలో భాగంగా మారూమ్ అగ్నిపర్వత జలంలో ఉన్న లావా సరస్సుకు సమీపంలోకి వెళ్లాలని ఈ బృందం నిర్ణయించింది.
ప్రపంచంలో లావా సరస్సులు ఏడే ఉన్నాయి. అందులో వాన్వాట్ దేశంలో ఉన్న ఈ లావా సరస్సు కూడా ఒకటి. అయితే..సరస్సు వద్దకు వెళ్లడమంటే ప్రాణాలకు తెగించడమే. 45 డిగ్రీలంటేనే మనం అల్లాడుతాం. అలాంటిది 1,650 డిగ్రీలంటే మాడిపోవడమే. ఆమ్ల వర్షాలతో పాటు, విష వాయువులు వెలువడటం ఇక్కడ మామూలే. దీనికితోడు తమ ప్రాజెక్టు కోసం ఫోటోలు తీయడమంటే అసాధ్యమే. అయితే..ఫోటోలు, వీడియో చిత్రీకరణ కోసం వారు డ్రోన్లను వాడారు. అత్యంత వేడిని తట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక సూట్లను ధరించారు.