heavvy rain
-
నాలుగు రోజుల్లో 110 మంది
న్యూఢిల్లీ: నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్ వారు కాగా, ఎడతెగని వానలతో బిహార్ రాజధాని పట్నాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రుతుపవనాల తిరోగమనం తీవ్రంగా ఆలస్యం కావడంతో బిహార్ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. పట్నాలోని చాలా ప్రాంతా ల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో అనూహ్యం గా 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పట్నా, దనపూర్ తదితర రైల్వే స్టేషన్లు వరదల్లో చిక్కుకుపోవడంతో రైల్వే శాఖ 30 రైళ్లను రద్దు చేసింది. కొన్ని విమానసర్వీసులను కూడా దారి మళ్లించారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా.. ఉత్తరప్రదేశ్ లో 79 మంది, గుజరాత్లో ముగ్గురు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కలిపి 13 మంది మృతి చెందారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పొంగిపొర్లుతున్న నదిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పరితోష్ మండల్ కొట్టుకుపోయారు. 36వ బెటాలియన్‌కు చెందిన మండల్ కోసం అధికారులు గాలిస్తున్నారు -
వైఎస్ఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
జమ్మలమడుగు: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దముడిగం, జమ్మలమడుగు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ప్రొద్దుటూరు, మద్దనూరు మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో జొన్న, వేరుశనగ పంటలు నీటమునిగాయి. పొలాల్లో నీళ్లు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. -
తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం
తిరుమల: అల్ప పీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కాళంగి జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా తిరుమలలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో చంటి బిడ్డలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఘాట్ రోడ్ లో స్వల్పంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపధ్యంలో టీటీడీ వాహనదారులను అప్రమత్తం చేసింది. రోడ్లపై పడుతున్న చిన్న చిన్న బండరాళ్లను సిబ్బందితో తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.