నిండుకుండలా తాటిపూడి
292 అడుగులకు చేరిన నీటిమట్టం
గంట్యాడ: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాటిపూడి రిజర్వాయర్ నిండుకుండలా కనిపిస్తోంది. మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో గణనీయంగా నీటిమట్టం పెరిగింది. సోమవారం నాటికి 292 అడుగులకు చేరింది. రెండురోజుల్లో పూర్తి స్థాయిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ జేఈ మూర్తి తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 297 అడుగులు కావడంతో మరో 5అడుగులు మాత్రమే వ్యత్యాసం ఉన్నందున అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు నదీ పరిసరాలలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటే రిజర్వాయర్లో నీటిమట్టం 295కు చేరిన తరువాత ముందస్తు హెచ్చరికలలో భాగంగా గేట్లను ఎత్తి నీటిని బయటకు వదులుతామని వివరించారు. ఇన్ఫ్లో 1200 క్యూసెక్టులు ఉన్నందున నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం అరుకు, అనంతగిరి మండలాలలో వర్షం ఎక్కువగా కురవడంతో ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నదన్నారు. జామి, విశాఖ జిల్లా మద్ది, తగరపువలస, పద్మనాభం తదితర దిగువ మండలాల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపారు.