రాజధానిలో ‘మందు’ ప్రవాహం!
నూతన సంవత్సర వేడుకలకు విచ్చలవిడిగా మద్యం
ఆబ్కారీ శాఖ నుంచి భారీ సంఖ్యలో ఈవెంట్ పర్మిట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నూతన సంవత్సరం జోరు చుక్కలను తాకనుంది. విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉండనుంది. మద్యం దుకాణాలు, బార్లకు తోడు ఈ సారి ఫంక్షన్ హాళ్లు, సాధారణ క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రూప్ హౌజ్‌లు, రిసార్టుల్లో డిసెంబర్ 31వ తేదీన ఒక్కరోజు మద్యం విక్రయాలు జరుగనున్నాయి. ఇందుకోసం సుమారు 200 మంది నిర్వాహకులు ఆబ్కారీ శాఖ నుంచి ఈవెంట్ పర్మిట్లు పొందారు.
డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజుకు పరిమితమయ్యే ఈ పర్మిట్ రుసుము రూ. 6 వేలు. ఈ ఈవెంట్ పర్మిట్లు పొందిన ప్రదేశంలో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు, వినియోగానికి ఆబ్కారీ శాఖ అనుమతి ఇస్తుంది. ఆ సమయం మినహా మిగతా సమయాల్లో విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా.. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 225 బార్లు, 160 మద్యం దుకాణాలు, 150 వరకూ పబ్‌లు ఉన్నాయి. వాటికి ఈవెంట్ పర్మిట్లు పొందిన ప్రదేశాలు తోడు కానున్నాయి.