Heavy robbery
-
ఢిల్లీలో పట్టపగలే భారీ దోపిడీ..
ఏటీఎం వ్యాన్ గార్డు కాల్చివేత.. రూ. కోటిన్నరతో ఉడాయింపు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ దగ్గర్లోనికమలానగర్, బంగ్లారోడ్డులోని సిటీ బ్యాంకు ఏటీఎం కేంద్రం. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ సిబ్బంది ఏటీఎంమెషీన్లో నగదును నింపేందుకు వ్యానులో వచ్చారు. వ్యాను డ్రైవర్, సెక్యూరిటీ గార్డు సతేందర్ ఏటీఎం బయట ఉండగా, ఇద్దరు సిబ్బంది ఏటీఎం మెషిన్లో నగదును నింపుతున్నారు. ఇంతలో ఆయుధాలు ధరించిన ఇద్దరు అగంతకులు బైక్‌పై వచ్చారు. వచ్చీ రావడంతోనే సతేందర్ తలపై కాల్పులు జరిపారు. ఏటీఎంకేంద్రంలోకి చొరబడి సిబ్బందిని చంపుతామని బెదిరించి, రూ.1.5కోట్ల నగదున్న సూట్‌కేస్‌ను లాక్కుని పరారయ్యారు. స్థానికులు మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరిస్తుండడాన్ని చూసిన ఆగంతకులు హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపి వెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సతేందర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగాఅక్కడే మృతిచెందాడు. దోపిడీ ఘటన ఏటీఎం కేంద్రంలోని సీసీటీవీ కెమెరాలో, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దొంగలు హెల్మెట్లు ధరించి ఉండడంతో గుర్తింపు కష్టసాధ్యంగా మారింది. వారు వాడిన పల్సర్ బైక్ నెంబర్ వీడియోలో కనిపిస్తున్నా అది దొంగిలించినదై ఉంటుందని భావిస్తున్నారు. -
శామ్సంగ్ ఫ్యాక్టరీలో రూ.215 కోట్ల దోపిడీ!
బ్రెజిల్లో 40 వేల ఫోన్లు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శామ్సంగ్ ఫ్యాక్టరీలోకి చొరబడిన 20 మంది సాయుధ దొంగలు ఏకంగా రూ. 215 కోట్ల విలువైన 40వేల సెల్ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని పరారయ్యారు. తొలుత నైట్‌షిఫ్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి దగ్గరలో హైజాక్ చేసిన దొంగలు.. బస్సులోని 8 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్ఫోన్లు తీసుకున్నారు. ఏమీజరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లడం చూస్తుంటే.. ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి పరికరాల మొత్తం విలువను నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.