ఢిల్లీలో పట్టపగలే భారీ దోపిడీ..
ఏటీఎం వ్యాన్ గార్డు కాల్చివేత.. రూ. కోటిన్నరతో ఉడాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కమలానగర్ మార్కెట్ ప్రాంతంలో ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును హత్య చేయడంతో పాటురూ. కోటిన్నర దోచుకుని పరారయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయం... ఢిల్లీవర్సిటీ దగ్గర్లోనికమలానగర్, బంగ్లారోడ్డులోని సిటీ బ్యాంకు ఏటీఎం కేంద్రం. సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ సిబ్బంది ఏటీఎంమెషీన్‌లో నగదును నింపేందుకు వ్యానులో వచ్చారు.
వ్యాను డ్రైవర్, సెక్యూరిటీ గార్డు సతేందర్ ఏటీఎం బయట ఉండగా, ఇద్దరు సిబ్బంది ఏటీఎం మెషిన్‌లో నగదును నింపుతున్నారు. ఇంతలో ఆయుధాలు ధరించిన ఇద్దరు అగంతకులు బైక్‌పై వచ్చారు. వచ్చీ రావడంతోనే సతేందర్ తలపై కాల్పులు జరిపారు. ఏటీఎంకేంద్రంలోకి చొరబడి సిబ్బందిని చంపుతామని బెదిరించి, రూ.1.5కోట్ల నగదున్న సూట్‌కేస్‌ను లాక్కుని పరారయ్యారు. స్థానికులు మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరిస్తుండడాన్ని చూసిన ఆగంతకులు హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపి వెళ్లారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సతేందర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగాఅక్కడే మృతిచెందాడు. దోపిడీ ఘటన ఏటీఎం కేంద్రంలోని సీసీటీవీ కెమెరాలో, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దొంగలు హెల్మెట్లు ధరించి ఉండడంతో గుర్తింపు కష్టసాధ్యంగా మారింది. వారు వాడిన పల్సర్ బైక్ నెంబర్ వీడియోలో కనిపిస్తున్నా అది దొంగిలించినదై ఉంటుందని భావిస్తున్నారు.