బెంగళూరు, న్యూస్‌లైన్ : ఏటీఎంలో నగదు లూటీకి విఫలయత్నం జరిగింది. సంఘటనలో సెక్యూరిటీ గార్డు ప్రాణాలకు తెగించి ఎదురుదాడికి దిగి, ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన సందీప్(30)గా పోలీసులు గుర్తించారు. డీసీపీ టీడీ పవార్ తెలిపిన మేరకు... మడివాళ సమీపంలోని బేగూరు మెయిన్ రోడ్డు, హొంగసంద్రలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రం వద్ద శనివారం రాత్రి షహబుద్దీన్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.
ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు బైక్‌పై ఇద్దరు అక్కడకు చేరుకున్నారు. వీరిలో ఒకరు హెల్మ్‌ట్ పెట్టుకుని బైక్‌పై ఉన్నాడు. మంకీ క్యాప్‌తో ఏటీఎం కేంద్రం తలుపు తీశాడు. ఆ సమయంలో కుర్చీలో ఉన్న షహబుద్దీన్ పైకి లేచడంతో అతనిపై వేటకొడవలితో ఆగంతకుడు దాడి చేసి, కాళ్లుచేతులు కట్టివేశాడు. తరువాత లోపలకు వెళ్లి ఏటీఎం యంత్రం బద్ధలుగొట్టేందుకు ప్రయత్నించాడు. కొద్ది సేపటికి అటుగా బీట్ కానిస్టేబుల్ రావడాన్ని గమనించిన బైక్‌పై ఉన్న ఆగంతకుడు కేకలు వేసి లోపల ఉన్న తన సహచరుడిని అప్రమత్తం చేశాడు. అదే సమయంలో షహబుద్దీన్ కట్లు విప్పదీసుకున్నాడు.
తలుపు తీసుకుని బయటకు వస్తున్న ఆగంతకుడిని ఒడిసి పట్టుకుని, కానిస్టేబుల్‌ను అప్రమత్తం చేశాడు. ఇంతలో బైక్‌పై ఉన్న ఆగంతకుడు వాహనంతో సహా పారిపోయాడు. షహబుద్దీన్ పట్టునుంచి తప్పించుకోవడంలో ఆగంతకుడు గాయపడ్డాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్, ముసుగు వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించాడు. అనంతరం నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయపడిన షహబుద్దీన్‌కు చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన షహబుద్దీన్‌కు పురస్కారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు సిఫారసు చేసినట్లు డీసీపీ తెలిపారు. సంఘటనపై మడివాళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏటీఎంలో నగదు లూటీకి యత్నం
Published Mon, Dec 30 2013 3:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement