Heay theft
-
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
సాక్షి, ముంబై: ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. మహారాష్ట్రను ఒకరోజు ముందే రుతుపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి ముందస్తు సూచనలు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ముంబై రీజియన్, కొంకణ్ రీజియన్‌లోని అన్ని జిల్లాలకు చెందిన ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తే సాయం కోసం కోస్టు గార్డులు, సైన్యం సిద్ధంగా ఉండాలని సూచనలివ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబైసహా ఇతర కార్పొరేషన్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్పొరేషన్ల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ తగిన సూచనలివ్వాలని తెలిపారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత, మందుల కొరత లేకుండా చూడలి. అవసరమైతే వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యంత్రసామగ్రిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆస్పత్రుల్లో జనరేటర్లు, వాటికి అవసరమైన డీజిల్ ముందుగానే సమకూర్చుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదివరకే నగరంలో లోతట్టు ప్రాంతాలున్న చోట వర్షపు నీరు బయటకు తోడేందుకు 474 మోటర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. అత్యవసరం సమయంలో సాయం కోసం ఎదురుచూసే బాధితులకు అన్ని హెల్ప్‌లైన్ నంబర్లు పనిచేసేలా చూడాలన్నారు. కంట్రోల్ రూముల్లో 24 గంటలు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. చదవండి: Coronavirus: స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు -
శ్రీకాకుళంలో భారీ చోరీ!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ-ఎ కాలనీలో ఉంటున్న అంధవరపు గోవిందరాజులు ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... గోవిం దరాజులు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి, అక్కడ నుంచి బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. రోజూ పనిమనిషి వచ్చి ఇంటి చుట్టూ శుభ్రం చేసి వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఉద యం వచ్చే సరికి కిటికీ గ్రిల్ తొలగించి ఉండడం, ఇం టితలుపు తెరిచి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. వారు వచ్చి చూసి గోవిం దరాజులకు సమాచారం అందించారు. ఆయన ఇచ్ఛాపురంలో ఉన్న తన కుమారుడు నాగేశ్వరరావు, శ్రీకాకుళంలో ఉన్న సోదరుడు శ్రీనివాసరావుకు విషయం తెలియజేశారు. వారు ఇంటి వద్దకు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సెలవులో ఉండడంతో సీఐ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో బీరువాలను కానీ, మరే సామాగ్రిని కానీ విరగ్గొట్టకపోగా అలమరాలన్నింటినీ తెరిచి అందులో ఉన్న వెండి, బంగారం వస్తువులను తీసుకువెళ్లారని యజమాని బంధువులు చెబుతున్నారు. దేవుడి గదిలో వెండి వస్తువులు ఉన్నా వాటిని తీసుకువెళ్లలేదు. వస్తువులు ఉన్న అలమరాలను మాత్రమే తెరవడం వల్ల ఇది తెలిసిన వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలే ఈ పని చేసి ఉంటే విలువైన వస్తువులన్నింటినీ తీసుకువెళ్లిపోయేవారని, అలా కాకుండా కొన్నింటినే తీసుకువెల్లడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సుమారు 17 కేజీల వెండి, 12 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చునని యజమాని బంధువులు చెబుతున్నారు. సీఐ ఎం.మహేశ్వరరావు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. దేవుడి గదిలో ఉన్న వస్తువులు కూడా పోయి ఉంటాయని భావించి వారు అలా చెప్పి ఉండవచ్చునని దేవుడి గదిలో ఏ వస్తువు పోలేదన్నారు. యజమాని వచ్చి నిర్ధారించి లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే కానీ ఖచ్చితంగా ఎంత పోయింది చెప్పలేమన్నారు. రూరల్ హెచ్‌సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.