బెంగుళూరు స్టీల్ ఫ్లైఓవర్ రద్దు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య సాగుతున్న అవినీతి ఆరోపణల పర్వంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం బసవేశ్వర కూడలి నుంచి హెబ్బాళ వరకు 6.7 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సర్కారు రద్దు చేసింది.
ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. తమ నిబద్దతను చాటుకోవడానికే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం రద్దు చేశామని చెప్పారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి, కాంగ్రెస్ అధిష్టానికి ముడుపులు ముట్టినట్లు బీజేపీ ఆరోపణలు చేయడం తగదన్నారు. రూ. 1,800 కోట్ల విలువైన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన 4 నెలల క్రితం తెరపైకి వచ్చింది. స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 812 చెట్లు నరికేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.