కాగితాల్లోనే ‘సుంకిశాల’!
= సర్కారు నిర్లక్ష్యమే కీలక పథకానికి గ్రహణం
=ఏడాదిగా మోక్షం కలగని కృష్ణా హెడ్‌వర్క్స్ పనులు
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడు దశల పంపింగ్‌కు కీలకమైనసుంకిశాల (నల్లగొండ జిల్లా) ఇన్‌టేక్‌వెల్ నిర్మాణం (కృష్ణా హెడ్‌వర్క్స్) పనులు ఏడాదిగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి. కృష్ణా మొదటి, రెండో దశలతో పాటు ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభమైన మూడోదశ పథకానికి అవసరమైన రావాటర్ సేకరణకు ఈ పథకమే అత్యావశ్యకమని నిపుణులు స్పష్టం చేస్తున్నా.. సర్కారు నిర్లక్ష్యం వీడట్లేదు. ఏడాది క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.840 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు అంచనాలు, డిజైన్లు సిద్ధం చేసి జలమండలి, రాష్ట్ర ప్రభుత్వానికిసమర్పించింది.
నాగార్జున సాగర్ నుంచి గ్రేటర్ అవసరాలకు నీటి తరలింపునకు ఢోకా లే కుండా చూసేందుకు జలమండలి ఈ పథకానికి శ్రీకారం చుట్టిం ది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కన్నా దిగువకు నీటిమట్టం పడిపోయినపుడు నగరానికి నీటి సరఫరాపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్ నిర్మించే ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్, నీటిపారుదల శాఖ కూడా ఆమోదించినా సర్కారు పైసా నిధులు విదిల్చకపోవడంతో పథకం ఫైళ్లకే పరిమితమైంది.
ఇన్‌టేక్ వెల్ ఉపయోగమిదే..
ప్రస్తుతం సాగర్ నీటిపారుదల కాల్వల (ఇరిగేషన్ కెనాల్స్) నుంచి కృష్ణా మొదటి, రెండో దశ పథకాల ద్వారా కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)కు నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను పంపింగ్‌చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటిమట్టాలు 510 అడుగుల దిగువనకు పడిపోయినపుడు నగరానికి తాగునీటి సరఫరాపై తరచూ ఆందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం సాగర్ నుంచి కోదండాపూర్‌కు అక్కడి నుంచి పుట్టంగండికి రావాటర్ పంపింగ్ చేస్తున్నారు.
అటు నుంచి నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ వరకు రావాటర్ తరలిస్తున్నారు. తాజా ప్రాజెక్టు ద్వారా కోదండాపూర్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాల వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో భూమికి అత్యంత లోతున మూడు పెద్ద బావులు (జాక్‌వెల్స్) నిర్మిస్తారు. వాటికి 18 మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రావాటర్‌ను కోదండాపూర్‌కు పంపింగ్ చేస్తారు. ఈ నిర్మాణంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 465 అడుగులకు పడిపోయినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మూడు దశల పంపింగ్‌కు అత్యావశ్యకం
ఈ ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయితే రోజు వారీగా కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్లను సుంకిశాల ఇన్‌టేక్ వెల్ వద్ద నుంచే పంపింగ్ చేసే అవకాశముంటుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.840 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తే పథకం సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆ నిధులను జైకా నుంచి సేకరించేందుకు అవసరమైన పూచీకత్తు సమర్పించినా పథకం రూపుదాల్చనుంది.