మీ చెప్పుల హీల్ సైజ్ మీరేంటో చెప్తుంది!
న్యూయార్క్: మీ గర్ల్ ఫ్రెండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆమె కాళ్లకు వాడే చెప్పులను గమనిస్తే సరిపోతుంట. సమాజంలో వారిని వారు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో.. వాళ్లు వాడే చెప్పుల హీల్ సైజ్ ఆధారంగా అంచనా వేయొచ్చని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. భిన్న నేపథ్యాలున్న మహిళల 16,236 ఆన్లైన్ కొనుగోళ్లను పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు.
హీల్ సైజ్ ఎక్కువగా ఉండేలా మహిళలు జాగ్రత్త పడుతున్నారంటే వారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతున్నట్లేనని పరిశోధకులు వెల్లడించారు. మధ్యతరగతి, పేద మహిళలు సైతం సంపన్న మహిళలలా కనిపించాలని, తమ వాస్తవిక నేపథ్యాన్ని వేరుగా చూపించాలనే కాంక్షను వెలిబుచ్చుతున్నారని పరిశోధకులు తెలిపారు. సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలు ఈ ఫ్యాషన్ అనుకరణకు దారితీస్తున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కర్ట్ గ్రే తెలిపారు. ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ సైతం హై స్టేటస్ ఉన్నట్లు కన్పించే వస్తువులను తక్కువ ధరకు అందించి వినయోగదారులను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. పురుషుల్లో సైతం వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల విషయంలో ఈ అనుకరణ గమనించొచ్చని చెబుతున్నారు.