అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్
సూపర్ సైక్లోన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కోరారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలెన్ తుపాను తర్వాత లెహర్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందన్నా రు. లెహర్ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారి ఈ నెల 28 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని చెప్పారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముం దస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, మిలటరీ, నెవీ, కోస్ట్‌గార్డులను సహాయ చర్యల కు వినియోగిస్తామని తెలిపారు. పంట కోతకు వచ్చిన సమయంలో రైతులు మరింత నష్టపోకుండా ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయాలని కోరారు.
స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా 450 మంది ఫైర్ ఆఫీసర్లను, 450 మంది పోలీసు అధికారులకు శిక్షణనిచ్చి సిద్ధం చేశామన్నారు. గతంలో కురిసిన వర్షాలకు చెరువులకు గండ్లు పడిన చోట మరింత అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు కిరోసిన్ ఇతర ఆహార పదార్థాల నిల్వల విషయంలోప్రతిపాదనలు పంపాలని కోరారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని జిల్లాకు పంపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటికే అన్ని చెరువులు నిండి ఉన్నాయని, వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఇన్చార్జీ డీఆర్ఓ అంజయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ కరుణాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు పాల్గొన్నారు.