Hello Brother
-
హిందీలో తాప్సీ హలోబ్రదర్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘పింక్’ చిత్రంలో నటించిన తాప్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో తాప్సీకి బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్న ‘జుడ్వా-2’లో ఓ హీరోయిన్గా తాప్సీ ఎంపికయ్యారు. నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య కాంబినేషన్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో బ్రదర్’కు ఇది రీమేక్. 1994లో ‘హలో బ్రదర్’ విడుదలైన మూడేళ్లకు ‘జుడ్వా’ పేరుతో డేవిడ్ ధావన్ హిందీలో రీమేక్ చేశారు. ఆ రీమేక్‌లో సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్, రంభ నటించారు. ఇటు తెలుగులో, అటు హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి హిందీలో సీక్వెల్ తీయనున్నారు డేవిడ్. తెలుగులో సౌందర్య, హిందీలో రంభ చేసిన పాత్రను తాజా సీక్వెల్లో తాప్సీ చేయనున్నారు. అలాగే తెలుగులో రమ్యకృష్ణ, హిందీలో కరీనా కపూర్ చేసిన పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జుడ్వా-2’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు. -
రెండోసారి 'హలో బ్రదర్' రీమేక్
ఇటీవల కాలంలో సౌత్ సినిమాలో బాలీవుడ్లో వరుసగా రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి సౌత్ కథల మీదే ఆధారపడుతున్నారు. అదే బాటలో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఓ సౌత్ సినిమా మీద దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్లో ఒకసారి రీమేక్ అయిన సినిమా కావటం మరో విశేషం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన హలో బ్రదర్ సినిమాను వరుణ్ ధావన్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. 1994లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన హలో బ్రదర్ సినిమాను జుడ్వా పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా హలో బ్రదర్ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. జుడ్వా సినిమాకు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ మరోసారి తన కొడుకు హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా రీమేక్‌పై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో నాగచైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో హలో బ్రదర్ సినిమాను రీమేక్ చేస్తారంటూ భారీ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆగిపోయింది. మరి బాలీవుడ్ రీమేక్ తరువాత అయినా తెలుగులో హలో బ్రదర్‌ను రీమేక్ చేస్తారేమో చూడాలి. -
‘హలో బ్రదర్’ని తలపించేలా...
వారసత్వంగా వస్తున్న ఆస్తిని కాపాడుకోడానికి ఓ కుర్రాడు ఎన్ని పాట్లు పడ్డాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న హాస్యభరిత చిత్రం ‘జంప్ జిలాని’. అల్లరి నరేశ్ తొలిసారి అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు దర్శకుడు. అంబికా రాజా నిర్మాత. ఇషా చావ్లా, సాక్షి దీక్షిత్ కథానాయికలు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘‘హలో బ్రదర్’లో నాగార్జునగారి ద్విపాత్రాభినయాన్ని తలపించేలా ఇందులో అల్లరి నరేశ్ పాత్రలు సాగుతాయి. ఇందులో ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా నటిస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా ఉంటుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘తమిళ చిత్రం ‘కలగలప్పు’కు ఈ చిత్రం రీమేక్. రెండు పాత్రల్లో నరేశ్ కావల్సినంత వినోదాన్ని పంచుతారు. ఇందులోని ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకాక్, పుకెట్లలో నరేశ్, ఇషా, సాక్షి దీక్షిత్‌లతో పాటల్ని తీస్తున్నాం. ఓ వైపు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోంది’’ అని నిర్మాత చెప్పారు. విజయ్ ఎబెంజర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేస్తామని సమర్పకుడు అంబికా కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, అంబికా కృష్ణ బ్రదర్స్. -
సేమ్ టు సేమ్
నేడు కవలల దినోత్సవం అప్పుడపుడు ఇలాంటి అనుభవాలు మనకు ఎదురవుతుంటాయి. ఒకే పోలిక కలిగిన వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతుంటాం. ప్రపంచంలో ఒకే పోలిక గల వారు ఏడుగురు ఉంటారని చెప్పుకునే మాట అటుంచితే... కవలలుగానో, ట్రిప్లెట్స్ గానో పుట్టిన వాళ్లల్లో ఒకరిని చూసి ఇంకొకరుగా భ్రమిస్తుంటాం. పోల్చుకోలేనంతగా పోలికలు ఉండడంతో తికమక పడుతుంటాం. బాల్యంలో కవలలను చూసి పోల్చుకోవడం కష్టంగానే ఉంటుంది. శిశు దశలో కవలలను చూసి తల్లిదండ్రులే పోల్చుకోలేకపోతుంటారు. అందుకే కవలలు జన్మించగానే ఆస్పత్రుల్లో డాక్టర్లు మొదట జన్మించిన శిశువుకు ఏదో ఒక గుర్తు ఉంచుతారు. పెద్దయ్యాక పోలికల్లో కొంచెం తేడా కన్పించినా బాల్యంలో మాత్రం కవలలు ప్రతిబింబాల్లా అనిపిస్తారు. సినిమాలు హలోబ్రదర్, జీన్స్, గంగా మంగ, రాముడు భీముడు, అదుర్స్.. ఇలా ఇంకా పలు తెలుగు, హిందీ సినిమాలకు కవలల అంశం ప్రధాన కథాంశంగా మారి అలరించింది. హీరోలు డబల్ యాక్షన్‌లో చేస్తున్న గమ్మత్తై పనులు ప్రేక్షకులను అలరించి సినిమాలను విజయవంతం చేస్తున్నాయి. మోదం-ఖేదం కవలల్లో ఇద్దరు మగ పిల్లలైతే తల్లిదండ్రులు జాక్‌పాట్ కొట్టినట్లేనని చుట్టుపక్కల వారు ఆకాశాన్ని ఎత్తేస్తారు. ఆడ, మగ శిశువులైతే దేవుడు బ్యాలెన్స్ చేశాడని సంతృప్తి పరుస్తారు. కానీ, ఇద్దరు ఆడ శిశువులైతే చుట్టు పక్కల వారి సానుభూతిని భరించడం తల్లిదండ్రులకు కష్టమే. అత్తింటి వారే గాక విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కవలల తల్లిని సూటిపోటు మాటలతో వేధిస్తారు. కవలలు జన్మించారన్న తల్లి ఆనందాన్ని క్షణాల్లో ఆవేదనగా మారుస్తారు. ఎందుకిలా? కవలలు జన్మించడానికి శాస్త్రీయమైన కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మోనో జైగోటిక్స్కు సంబంధించిన వారు ఒకే గర్భ సంచిలో ఒకే మాయలో ఇద్దరు ఆడ, మగ శిశువులుగా పెరుగుతారు. అలాంటి వారికి ఒకే పోలిక, ఒకే గ్రూపు రక్తం వచ్చే అవకాశముంది. ఇలాంటి వారు ఒక ఆడ, ఒక మగ శిశువులుగా జన్మించే అవకాశం ఉంది. డైజైగోటిక్స్కు చెందిన వారు ఒకే గర్భ సంచిలో వేర్వేరు మాయల్లో పెరుగుతారు. ఇద్దరు ఆడ లేక ఇద్దరు మగపిల్లలుగా పుడతారు. తల్లివైపు వారసత్వంతోనూ, గర్భం దాల్చే సమయంలో ఎక్కువ మందులు వాడినప్పుడు కవలలు జన్మించే అవకాశం ఉంది. పురుష బీజకణం స్త్రీ అండంతో కలిసి వెంటనే రెండుగా విడిపోయినపుడు కవలలుగా ఏర్పడతారు. - న్యూస్‌లైన్, కడప కల్చరల్ -
ఫిబ్రవరిలో మొదలు...
నాగార్జునతో ‘ఢమరుకం’ తర్వాత దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నాగచైతన్యతో సినిమా కమిట్ అయ్యారు. తొలుత ‘హలో బ్రదర్’ని రీమేక్ చేయాలనుకున్నారు. అది కుదరక, కొత్త కథతో సినిమా చేయబోతున్నారు. ఆకుల శివ కథ, మాటలు అందిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 6న చిత్రీకరణ మొదలువుతుందని సమాచారం. ఓ ప్రముఖ కథానాయిక ఇందులో నటించబోతున్నారట.