హెల్మెట్ తప్పనిసరి
► హెల్మెట్ లేకుంటే ఇక జరిమానా
వాహనదారులు ఇకపై కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
శనివారం హెల్మెట్ లేని వాహనదారుల నుంచి అధికారులు రూ.15 వేలు జరిమానా వసూలు చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ అమలుపై కొంత కాలంగా వివిధ రూపాల్లో అవగాహ న కార్యక్రమాలు చేపట్టిన రవాణా శాఖ శనివారం ప్రత్యక్ష తనిఖీలకు శ్రీకారం చుట్టింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై కొరడా ఝళిపించింది. హెల్మెట్ ధరించని వారిపై రూ.100 చొప్పున జరిమానా విధించింది. శనివారం ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ రవాణా అధికారి దశరథం నేతృత్వంలో దాడులు నిర్వహించి పలువురు వాహనదారులకు జరిమానా విధించారు.
మరోవైపు హెల్మెట్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించడంతో పాటు, తనిఖీలను కూడా విస్తృతం చేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. మొదటి విడత జరిమానాతో సరిపెట్టినప్పటికీ అదేపనిగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ శాతం ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లనే వాహనదారులు మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లోనూ హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలై చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ముఖ్యంగా యువత ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ఇంటి నుంచి యలుదేరే ముందు మీపై ఆధారపడిన కుటుంబసభ్యులను గుర్తు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు. కాగా శనివారం నగరవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 143 కేసులు నమోదు చేసి, 15 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు.