వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె చేయాలి
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు రావాలంటే సమ్మె చేయాలని, దీనికి అందరూ కలిసి రావాలని ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో కొందరు నాయకులు, అధికారులు, దళారులు లక్షల రూపాయలు తీసుకుంటూ అమాయక కార్మికులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము సస్పెండ్ చేసిన భూపాలపల్లి, కొత్తగూడం ఏరియాల ఉపాధ్యక్షులను టీబీజీకేఎస్ చేర్చుకోవడం ద్వారా అవినీతి విషయంలో వారి వైఖరేంటో తెలియజేస్తోందని దుయ్యబట్టారు.
టీబీజీకేఎస్‌లో గొడవలతో యాజమాన్యం సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా స్ట్రక్చరల్, జేసీసీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో 20 మెగావాట్ల పవర్‌ప్లాంటు ఏర్పాటుకు యాజమాన్యం పూనుకోవడం తమ కృషితోనేనని అన్నారు. ఓసీపీలు వస్తేనే ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తామని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షుడు డి.అన్నయ్య, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్.జనార్దన్, నాయకులు వై.కాశీరావు, గంగయ్య పాల్గొన్నారు.