Heritage Politics
-
తప్పించడమే వారి ఎజెండా
సహరన్పూర్/అమ్రోహా/డెహ్రాడూన్: తనను అధికారం నుంచి తప్పించాలన్న ఏకైక ఎజెండాతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతిది విడదీయలేని అనుబంధమని ప్రధాని దుయ్యబట్టారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ఏఎం, ఎఫ్ఏఎం అనే పేర్లను ఈడీ చార్జిషీట్లో బయటపెట్టాడన్న మోదీ.. వీటిలో ఏఎం అంటే అహ్మద్ పటేల్ అనీ, ఎఫ్ఏఎం అంటే ఫ్యామిలీ అని వివరించారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు. పాక్ హీరో అయ్యేందుకు పోటీపడ్డారు.. ఉగ్రమూకలకు భారత్ దీటుగా బదులిస్తే కొందరికి నిద్రపట్టడం లేదని ప్రధాని విపక్షాలకు చురకలంటించారు. ‘ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే భారత్ జవాబివ్వడం కొందరికి నచ్చలేదు. మన దేశంపై ఉగ్రదాడి జరిగితే ప్రతిఘటించాలా? లేక మౌనంగా కూర్చోవాలా? ఉగ్రవాదులకు భారత్ దీటుగా బదులివ్వగానే కొందరికి నిద్రపట్టలేదు. పాకిస్తాన్ కపటబుద్ధిని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయగానే ఈ వ్యక్తులు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతేకాదు.. పాకిస్తాన్‌కు హీరోగా మారేందుకు వారిలో వారే పోటీపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లక్నో, కాశీలో బాంబులు పేలేవి. ఉగ్రదాడుల సూత్రధారులను విచారణ సంస్థలు పట్టుకున్నప్పుడు.. మాయావతి, అఖిలేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్లను వదిలేసి ప్రేమగా వ్యవహరించేవి’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాయన్నారు. అమేథీలో ఈసారి గెలవడం కష్టమని తేలడంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయారని వార్తలొచ్చాయనీ, ఆయన ఎక్కడ నుంచి పోటీచేయాలో కాంగ్రెస్ ఇష్టమన్నారు. ఈ విషయంపై మాట్లాడే హక్కు బీజేపీకి ఉందన్నారు. మేం ముస్లిం కుమార్తెల(బేటీ–బేటీ) భద్రత, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ముక్కలు ముక్కలుగా(బోటీ–బోటీ) నరుకు తామని చెబుతున్నారు. తనను ప్రతిపక్షాలు ‘మరుగుదొడ్ల చౌకీదార్’ అని పిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీని ముక్కలుముక్కలుగా చేస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ 2014లో వ్యాఖ్యానించారు. -
వ్యవస్థలను అవమానించారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికారంలో ఉండగా పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, మీడియా, సైన్యం ఇలా ఏ ఒక్కదాన్నీ వదలకుండా అన్ని వ్యవస్థలనూ ఆ పార్టీ అవమానించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన బుధవారం కోరారు. కాంగ్రెస్ తర్వాత వచ్చిన తమ ప్రభుత్వం పరిస్థితులను మార్చేసిందని మోదీ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ‘మీరు ఓటేయడానికి వెళ్లినప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అధికారం చేపట్టాలన్న ఒక్క కుటుంబం ఆరాటం దేశానికి ఎంత నష్టం కలిగించిందో మనసులో పెట్టుకుని ఓటేయండి. ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ అలాగే చేస్తారు’ అని మోదీ అన్నారు. ‘ప్రెస్ నుంచి పార్లమెంటు వరకు, సైనికుల నుంచి వాక్ స్వేచ్ఛ వరకు, రాజ్యాంగం నుంచి కోర్టుల వరకు, వ్యవస్థలను అవమానించడమే కాంగ్రెస్ నైజం. అందరూ తప్పు, కాంగ్రెస్ మాత్రమే ఒప్పు అనేది వారు నమ్మే సిద్ధాంతం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వంశపారం పర్యంగా పాలన సాగించే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు సరిగ్గా జరిగేవి కాదనీ, అదే వారసత్వ రాజకీయాలు చేయని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పని ఎక్కువ జరిగిందనడానికి గణాంకాలే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తొట్టతొలి రాజ్యాంగ సవరణ వాక్స్వాతంత్య్రాన్ని హరించేందుకు ఉద్దేశించినదనీ, స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉండటం వారసత్వ పార్టీలకు నచ్చలేదని ఆరోపించారు. బీజేపీవీ వారసత్వ రాజకీయాలే: కాంగ్రెస్ వారసత్వాల గురించి మాట్లాడటం, కాంగ్రెస్‌ను దూషించడం తగ్గించి మోదీ అసలైన ప్రజా సమస్యలపై ప్రసంగాలు చేస్తే మంచిదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. ‘ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆరెస్సెస్. ఆరెస్సెస్ ఓ కుటుంబమైనప్పుడు, ఆ కుటుంబంలోని వారికే పదవులు దక్కుతున్నప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కావా? అని ప్రశ్నించారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత ఇలా ఎన్నో సమస్యలు దేశాన్ని పీడిస్తున్నాయనీ, మోదీ వాటి గురించి ఏ సభలోనూ ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. కాపలాదారుడు దేశభక్తుడితో సమానం గతంలో మోదీ చాలా సార్లు తనను తాను దేశానికి కాపలాదారుడినని (చౌకీదార్) చెప్పుకోవడం, అనంతరం రఫేల్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కాపలాదారుడే దొంగ’ అని ప్రచారం చేయడం తెల్సిందే. అలా ప్రచారం చేసి కాపలాదారులను కాంగ్రెస్ అవమానించిందని మోదీ అన్నారు. నేరుగా తన పేరు చెప్పే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ కాపలాదారులను అడ్డం పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 25 లక్షల మంది కాపలాదారు(వాచ్మెన్)లను ఉద్దేశించి మోదీ ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రసంగించారు. అందులో ఆయన మాట్లాడుతూ కాపలాదారుడు అనే పదం నిజాయితీపరుడికి, దేశ భక్తుడికి పర్యాయపదంగా మారిందన్నారు. ఎన్నికల కోసం మోదీ ఇటీవలే ‘నేనూ కాపలాదారుడినే’ అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించడం తెలిసిందే. -
50 స్థానాల్లో వారసులు
ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి అత్యధికులు జాబితాలో ప్రణబ్ తనయుడు, పలువురు సీఎంల బిడ్డలు న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్న మన దేశంలో వారసత్వ రాజకీయాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో వివిధ పార్టీల నేతల కొడుకులు, కూతుళ్లే బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికం కాంగ్రెస్ అభ్యర్థులే కావడం గమనార్హం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ నుంచి రాహుల్, వరుణ్ గాంధీల వరకు వారసత్వ అభ్యర్థుల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని జాంగీపూర్ సిట్టింగ్ ఎంపీ అయిన అభిజిత్ ప్రస్తుతం అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాయబరేలీ నుంచి, ఆమె తనయుడు రాహుల్ అమేథీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. రాజీవ్ సోదరుడు సంజయ్ భార్య మేనక, ఆమె తనయుడు వరుణ్ కూడా బరిలో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రాతినిధ్యం వహిస్తున్న శివగంగ స్థానం నుంచి ఈసారి ఆయన తనయుడు కార్తి పోటీ చేస్తున్నారు. బీజేపీ లోక్‌సభ ఎంపీ యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ హజారీబాగ్(జార్ఖండ్) నుంచి, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా తనయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుణ(మధ్యప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు. బరిలో ఉన్న ఇతర వారసత్వ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి సచిన్ పైలట్, కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద తనయుడు జితిన్ ప్రసాద, కాంగ్రెస్ నేత మురళీ దేవరా కుమారుడు, కేంద్ర మంత్రి మిలింద్, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ తనయుడు సందీప్, హర్యానా సీఎం భూపీందర్ హూడా కొడుకు దీపీందర్, అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్ పుత్రుడు అభిషేక్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ తదితరులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే కాకుండా ఆర్జేడీ, ఎల్జేపీ, ఆరెల్డీ వంటి ప్రాంతీయ, చిన్నాచితకా పార్టీల నేతల సంతానం కూడా ఎన్నికల గోదాలో ఉన్నారు. వీరిలో ఆర్జేడీ చీఫ్ లూలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఎల్జేపీ చీఫ్ రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ తదితరులు ఉన్నారు.