సహరన్‌పూర్/అమ్రోహా/డెహ్రాడూన్: తనను అధికారం నుంచి తప్పించాలన్న ఏకైక ఎజెండాతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతిది విడదీయలేని అనుబంధమని ప్రధాని దుయ్యబట్టారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ఏఎం, ఎఫ్‌ఏఎం అనే పేర్లను ఈడీ చార్జిషీట్‌లో బయటపెట్టాడన్న మోదీ.. వీటిలో ఏఎం అంటే అహ్మద్ పటేల్ అనీ, ఎఫ్‌ఏఎం అంటే ఫ్యామిలీ అని వివరించారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు.
పాక్ హీరో అయ్యేందుకు పోటీపడ్డారు..
ఉగ్రమూకలకు భారత్ దీటుగా బదులిస్తే కొందరికి నిద్రపట్టడం లేదని ప్రధాని విపక్షాలకు చురకలంటించారు. ‘ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే భారత్ జవాబివ్వడం కొందరికి నచ్చలేదు. మన దేశంపై ఉగ్రదాడి జరిగితే ప్రతిఘటించాలా? లేక మౌనంగా కూర్చోవాలా? ఉగ్రవాదులకు భారత్ దీటుగా బదులివ్వగానే కొందరికి నిద్రపట్టలేదు. పాకిస్తాన్ కపటబుద్ధిని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయగానే ఈ వ్యక్తులు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతేకాదు.. పాకిస్తాన్‌కు హీరోగా మారేందుకు వారిలో వారే పోటీపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లక్నో, కాశీలో బాంబులు పేలేవి. ఉగ్రదాడుల సూత్రధారులను విచారణ సంస్థలు పట్టుకున్నప్పుడు.. మాయావతి, అఖిలేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్లను వదిలేసి ప్రేమగా వ్యవహరించేవి’ అని వ్యాఖ్యానించారు.
దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు
దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాయన్నారు. అమేథీలో ఈసారి గెలవడం కష్టమని తేలడంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయారని వార్తలొచ్చాయనీ, ఆయన ఎక్కడ నుంచి పోటీచేయాలో కాంగ్రెస్ ఇష్టమన్నారు. ఈ విషయంపై మాట్లాడే హక్కు బీజేపీకి ఉందన్నారు. మేం ముస్లిం కుమార్తెల(బేటీ–బేటీ) భద్రత, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ముక్కలు ముక్కలుగా(బోటీ–బోటీ) నరుకు తామని చెబుతున్నారు. తనను ప్రతిపక్షాలు ‘మరుగుదొడ్ల చౌకీదార్’ అని పిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీని ముక్కలుముక్కలుగా చేస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ 2014లో వ్యాఖ్యానించారు.
తప్పించడమే వారి ఎజెండా
Published Sat, Apr 6 2019 4:38 AM | Last Updated on Sat, Apr 6 2019 4:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment