ఆమె ఆ చిత్రానికి నిర్మాత కూడానా?
చెన్నై: హీరోయిన్ నయనతార తన పాలసీ మార్చుకుందా ? ప్రస్తుతం కోలీవుడ్లో చర్చ నీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నయనతార అంగీకరించిన చిత్రాలలో నటించడం వరకే తన పని అంటోందట. ప్రమోషన్ ఇతర అంశాలతో సంబంధం లేదని అగ్రిమెంట్లోనే పేర్కొంటోందట. ఈ విధమైన నిబంధనను ఆమె విధానంగా పెట్టుకుని చాలా కాలం అయింది.
రాజారాణి చిత్రం తరువాత ఏ చిత్ర ప్రచార కార్యక్రమాలలోనూ ఆమె పాల్గొనలేదు. తాజాగా అరం చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం చర్చకు దారి తీసింది. హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలలో అరం ఒకటి. ఇందులో ఆమె కలెక్టర్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ గోపి నయినార్. ఇంతకు ముందు విజయ్ హీరోగా దర్శకుడు ఏఆర్. మురుగదాస్ తెరకెక్కించిన కత్తి చిత్రం కథ తనదని కోర్టుకెక్కిన మింజూర్ గోపినే గోపి నయినార్గా పేరు మార్చుకున్నారు.
ఆయన అరం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి జె. రాజేశ్ నిర్మాత. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక టీవీ ఛానల్లో అరం చిత్ర ప్రచార కార్యక్రమంలో నయనతార పాల్గొన్నారు. ఆమె చిత్రం కోసం అంతగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కారణ ఏమిటంటే, ఈ చిత్ర నిర్మాత జె. రాజేశ్ తన మేనేజర్ కావడమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరో వర్గం అరం చిత్రానికి నిర్మాత నయనతారేనని, పేరుకు మాత్రమే జె. రాజేశ్ అని అంటున్నారు.