Hetiro
-
డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్లకు దరఖాస్తుల ఆహ్వానం
బుట్టాయగూడెం : హెటిరో డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్‌గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 350 ఉద్యోగాలకు వివిధ కేటగిరీలలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి 100 పోస్టులు, బీఎస్సీ కెమిస్ట్రీ వారికి 100 పోస్టులు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీకి 100 పోస్టులు, ఐటీఐ చదివిన వారికి 50 పోస్టులు ఉన్నాయన్నారు. 26 సంవత్సరాలలోపు వయసు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 3 నుంచి ఐటీడీఏలోని యువత శిక్షణ కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వైటీసీ కోఆర్డినేటర్ ఎస్వీ సత్యనారాయణ 9959536789 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
శరత్ చంద్రారెడ్డికి ఊరట
♦ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు.. హైకోర్టు ఉత్తర్వులు ♦ ‘హెటిరో’ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డికి కూడా దక్కిన ఊరట సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ‘ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్’ ఎండీ శరత్‌చంద్రారెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌కు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో శరత్‌చంద్రారెడ్డిని నిందితుడిగా చేరుస్తూ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శరత్‌చంద్రారెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. శరత్‌చంద్రారెడ్డి.. అరబిందో, ట్రైడెంట్, యాక్సిస్ క్లినికల్స్లతోపాటు మొత్తం 9 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నారన్నారు. ఈ కంపెనీలకు పలు దేశాల్లో అనుబంధ కంపెనీలున్నాయని, అక్కడికి అధికారిక కార్యక్రమాల నిమిత్తం తరచూ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి శుక్రవారం కోర్టు ముందు హాజరు కావడం ఇబ్బందిగా ఉందని కోర్టుకు నివేదించారు. 2012 మే 28 నుంచి ఇప్పటివరకు సీబీఐ కోర్టులో కేసు విచారణ 85 సార్లు వాయిదా పడిందని తెలిపారు. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యక్తిగత హాజరు నుంచి శరత్‌చంద్రారెడ్డికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెటిరోపై విచారణ ప్రక్రియ నిలిపివేత జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి హెటిరో కంపెనీ, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హెటిరో శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. పెట్టుబడుల నిర్ణయాన్ని కంపెనీ డెరైక్టర్‌గా తీసుకున్నారే తప్ప వ్యక్తిగతంగా కాదని శ్రీనివాసరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత హాజరు నుంచి శ్రీనివాసరెడ్డికి మినహాయింపునివ్వడంతోపాటు ఆయనకు సంబంధించి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత
♦ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ♦ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరబిందో, హెటిరో, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ కేసు ను కొట్టేయడంతో పాటు విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. ఆచార్య తరఫు న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌లకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపిం చిందన్నారు. ఇందుకు అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో ఉన్న పిటిషనర్‌ను బాధ్యులుగా చేసిందన్నారు.సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రద్యుమ్న తెలిపారు. భూ కేటాయింపులు, బదలాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ది పొందినట్లు, దురుద్దేశాలతో వ్యవహరించినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టేయడంతోపాటు విచారణ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సీబీఐ కోర్టులో ఆచార్యపై జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న పెన్నా పత్రాప్‌రెడ్డి, పి.ఆర్. ఎనర్జీ హోల్డింగ్స్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఆ ఉత్తర్వుల గడువు ముగిసిందని, కేసులో పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు విన్నవించారు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. వ్యక్తిగత హాజరు నుంచి వీర్వాణికి మినహాయింపు ఇందూ-గృహ నిర్మాణ మండలి భూ కేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఎంబసీ రియల్టర్ జితేంద్ర వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వీర్వాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి... వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. ఏపీఐ, ఫినిష్డ్ డోసేజెస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హెటిరోకు చెందిన అమెరికా వ్యాపారాన్ని ఫార్మా సంస్థ సిప్లా కొనుగోలు చేస్తోందని సమాచారం. వార్తా సంస్థ సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం హెటిరో యూఎస్ వ్యాపారం కాంబర్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో జరుగుతోంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న జనరిక్ కంపెనీల్లో ఇది ఒకటి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఓరల్ సొల్యూషన్స్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని రూ.3,250-3,575 కోట్లు వెచ్చించి సిప్లా దక్కించుకుంటోంది. డీల్‌లో భాగంగా కాంబర్కు చెందిన తయారీ యూనిట్లు కూడా సిప్లా పరం కాబోతున్నాయి. కాంబర్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా హెటిరోకు ఏటా రూ.1,625 కోట్ల ఆదాయం వస్తోంది. -
అవన్నీ రాజకీయ చార్జిషీట్లే
ప్రత్యేక కోర్టుకు నివేదించిన ‘హెటిరో’ న్యాయవాది జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకే కేసు హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసినవన్నీ రాజకీయ చార్జిషీట్లేనని హెటిరో ఫార్మా తరఫు న్యాయవాది పట్టాభి ప్రత్యేక కోర్టుకు నివేదించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అనేకమంది ఐఏఎస్ అధికారులు మారారని, అయినా అప్పటి ప్రభుత్వం చేసిన భూకేటాయింపులు నిబంధనలకు విరుద్ధమని ఎవరూ ఆరోపించలేదని తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లకు చట్ట పరిధిలో ఎలాంటి విలువ లేదన్నారు. జగన్ కంపెనీల్లో తాము చట్టబద్ధంగానే పెట్టుబడులు పెట్టామని, ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ హెటిరో ఫార్మా, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలు వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం విచారించారు. ఈ సందర్భంగా పట్టాభి వాదనలు విన్పిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టే దిశగానే సీబీఐ దర్యాప్తు సాగిందని చెప్పారు. క్విడ్‌ప్రోకో పద్దతిలోనే ఈ పెట్టుబడులు వచ్చాయంటూ సీబీఐ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అభూతకల్పనలని నివేదించారు. హెటిరోకు కేవలం లీజు పద్ధతిలో, ఎటువంటి అభివృద్ధీ చేయని భూములను కేటాయించిన విషయాన్ని సీబీఐ దాచిందని చెప్పారు. దీన్నిబట్టే సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, దురుద్దేశపూర్వకంగా, న్యాయస్థానాలను తప్పుదోవపట్టించే దిశగా సాగిందని స్పష్టమవుతోందని అన్నారు.