బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత | BP Acharya trial suspension | Sakshi
Sakshi News home page

బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత

Published Thu, Apr 21 2016 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత

బి.పి.ఆచార్యపై విచారణ నిలిపివేత

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

 సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో అరబిందో, హెటిరో, ట్రైడెంట్ లైఫ్ సెస్సైస్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ కేసు ను కొట్టేయడంతో పాటు విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆచార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ ఇలంగో విచారించారు.

ఆచార్య తరఫు న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందో, ట్రైడెంట్‌లకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపిం చిందన్నారు. ఇందుకు అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో ఉన్న పిటిషనర్‌ను బాధ్యులుగా చేసిందన్నారు.సీబీఐ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రద్యుమ్న తెలిపారు. భూ కేటాయింపులు, బదలాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ది పొందినట్లు, దురుద్దేశాలతో వ్యవహరించినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. అందువల్ల ఈ కేసును కొట్టేయడంతోపాటు విచారణ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సీబీఐ కోర్టులో ఆచార్యపై జరుగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేశారు.

 మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న పెన్నా పత్రాప్‌రెడ్డి, పి.ఆర్. ఎనర్జీ హోల్డింగ్స్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఆ ఉత్తర్వుల గడువు ముగిసిందని, కేసులో పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు విన్నవించారు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

వ్యక్తిగత హాజరు నుంచి వీర్వాణికి మినహాయింపు
ఇందూ-గృహ నిర్మాణ మండలి భూ కేటాయింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఎంబసీ రియల్టర్ జితేంద్ర వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వీర్వాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి... వీర్వాణికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement