High Court Madurai
-
డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు. అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు... డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జస్టిస్ ఆనంద్ వెంటకేషన్ కన్నెర్ర కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్‌కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ అప్పీల్ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్ వెంకటేషన్ టార్గెట్ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్ఎస్ఆర్లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు. న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు. సుమోటోగా కేసులు అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
హైకోర్టు ఆదేశాలు: ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ నియమాలను అధికారులు కఠితరం చేశారు. దీంతో ఇకపై వాహనదారులు హెల్మెట్ ధరించకున్నా, ఓవర్ స్పీడ్‌తో ముందుకు సాగినా, ఓవర్ లోడ్‌తో రోడ్డెక్కినా, సీటు బెల్టు పెట్టుకోకున్నా ఫైన్ తప్పదు. ఈ మేరకు సోమవారం నుంచి నిబంధనల్ని కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ వాడే విధంగా పోలీసులు సైతం కఠినంగా తొలినాళ్లలో వ్యవహరించారు. అయితే, 75 శాతం మంది హెల్మెట్లు వాడుతున్నా, 25 శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అప్పట్లో నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని కోర్టు మరో ఉత్తర్వు ఇవ్వడంతో దానిని అమలు చేయడానికి తీవ్రంగా కుస్తీ పట్టక తప్పలేదు. ఈమేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలతో పోలీసులు ముందుకు సాగారు. అయితే ఇదే సమయంలో కరోనా తెర మీదకు రావడంతో హెల్మెట్ సోదాలు గాల్లో కలిశాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ హెల్మెట్ వాడకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. పెరిగిన ప్రమాదాలతో.. చెన్నైలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15వ తేదీ వర కు వెయ్యికి పైగా ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి. ఇందులో 98 మంది హెల్మెట్ ధరించక పోవడంతో మరణించినట్టు తేలింది. అలాగే, 841 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కట్టడికి తగ్గ చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాజధాని నగరం చెన్నై కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భరతం పట్టనున్నారు. ఇద్దరూ ధరించాల్సిందే.. బైక్‌లో ఒకరు ప్రయాణించినా.. లేదా ఇద్దరు వెళ్లినా.. తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాల్సిందే. డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించి, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ధరించని పక్షంలో ఇద్దరికి కలిపి జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం చెన్నైలో 300కు పైగా ప్రాంతాల్ని గుర్తించి వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇక, పోలీసులు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ అయ్యాయి. హెల్మెట్ ధరించకుండా తిరిగే వారి భరతం పట్టడమే కాకుండా, సీటు బెల్టు వాడని వారు, అతి వేగంగా వాహనాల్ని నడిపే వారితో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇది కూడా చదవండి: హెల్మెట్ రూల్స్ ఇకపై మరింత కఠినతరం.. అలా చేసినా జరిమానే! -
సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎçప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా మదురై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై 14 ప్రశ్నలను సంధించింది.తిరునెల్వేలి జిల్లా సాంబవర్ వడకరైకి చెందిన శక్తివేల్ మద్యానికి బానిస. బీడీలు చుట్టి కార్మికురాలిగా పనిచేస్తూ భారంగా బతుకీడ్చే తల్లిని వేధించి డబ్బులు తీసుకుని మద్యం సేవించడం శక్తివేల్‌కు నిత్యకృత్యం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన తల్లితో గొడవపడి వేటకొడవలితో ఆమెను నరికాడు. ఈ కేసులో శక్తివేల్ అరెస్టయి జైలుపాలుకాగా బెయిల్ కోరుతూ మదురై హైకోర్టులో అతను దరఖాస్తు చేసుకోగా సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఎన్. కృపాకరన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. కుమారుని చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన తల్లి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అలాగే బెయిల్ పిటిషన్ దారుడు సైతం 30 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. కాబట్టి అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాను. సెంగోట్టై మేజిస్ట్రేట్ కోర్టులో రూ.10వేలకు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ పొందవచ్చు. రెండువారాల పాటు ఉద యం, సాయంత్రం సాంబవర్ వడకరై పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలి అని తీర్పు చెప్పారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, డీజీపీ, టాస్మాక్ యాజమాన్యంలను ఈ కోర్టు తానుగా ముందుకు వచ్చి ఈ బెయిల్ పిటిషన్‌పై వ్యతిరేక పిటిషన్ దారులుగా చేరుస్తోంది. వీరందరూ 14 ప్రశ్నలకు కోర్టుకు బదులివ్వాల్సి ఉంటుంది. దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే 500 టాస్మాక్‌లకు తాళం వేసింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ తేదీ నుంచి సంపూర్ణ మధ్య నిషేధం అమలవుతుంది? భారత్‌లోనూ, తమిళనాడులోనూ మద్యసేవనం పెరిగిపోతోందా? మద్యానికి బానిసలైన వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోందా ? ఈ ప్రశ్నకు ఏడాదివారిగా వివరాలు ఇవ్వాలి. మద్య సేవనం వల్ల నేరాలు ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయా ? గత పదేళ్లలో మద్య సేవనం నేపథ్యంలో ఏఏ నేరాలు చోటుచేసుకున్నాయి.? ఈ వివరాలను సైతం ఏడాది వారిగా దాఖలు చేయాలి. మద్యం సులభంగా అందుబాటులో ఉన్నందున పిల్లలు, విద్యార్థులు సైతం ఆకర్షితులు అవుతున్నారా? మద్యం తాగడం వల్ల చిన్నారులు నేరాలకు పాల్పడుతున్నారా ? మద్యం అమ్మకాల నేపథ్యంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారా ? పిల్లలకు మద్యం అమ్మ కూడదన్న చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కఠినంగా అమలు చేయకూడదు? చిన్నారులను మద్యానికి దూరం చేసేలా చైతన్యప్రచారాలను ఎందుకు చేపట్టకూడదు ? మద్యానికి బానిసలైన మగవారి వల్ల భార్యా పిల్లలు మానసికంగా బాధపడుతున్నారా ? సంపాదనంతా మద్యానికి ఖర్చు చేయడం వల్ల కుటుంబాల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం వాస్తవమేనా ? మద్యం సేవనం వల్ల చోటుచేసుకునే అనర్థాలపై అవగాహనకు తగిన నిధులు కేటాయిస్తారా? రోజుకు 70 లక్షల మంది మద్యంను సేవిస్తుండగా, ప్రతి 96 నిమిషాలకు ఒకరు చొప్పున మద్యంతో మరణిస్తుండగా, వీరికి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? మద్యం నుంచి విముక్తి తాలూకా స్థాయిలో కౌన్సెలింగ్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయరాదు? ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున బదులు చెప్పాలని ఆదేశించిన న్యాయమూర్తి కృపాకరన్ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.