సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎçప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా మదురై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై 14 ప్రశ్నలను సంధించింది.తిరునెల్వేలి జిల్లా సాంబవర్ వడకరైకి చెందిన శక్తివేల్ మద్యానికి బానిస. బీడీలు చుట్టి కార్మికురాలిగా పనిచేస్తూ భారంగా బతుకీడ్చే తల్లిని వేధించి డబ్బులు తీసుకుని మద్యం సేవించడం శక్తివేల్‌కు నిత్యకృత్యం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన తల్లితో గొడవపడి వేటకొడవలితో ఆమెను నరికాడు.
ఈ కేసులో శక్తివేల్ అరెస్టయి జైలుపాలుకాగా బెయిల్ కోరుతూ మదురై హైకోర్టులో అతను దరఖాస్తు చేసుకోగా సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఎన్. కృపాకరన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. కుమారుని చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన తల్లి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అలాగే బెయిల్ పిటిషన్ దారుడు సైతం 30 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. కాబట్టి అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాను. సెంగోట్టై మేజిస్ట్రేట్ కోర్టులో రూ.10వేలకు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ పొందవచ్చు. రెండువారాల పాటు ఉద యం, సాయంత్రం సాంబవర్ వడకరై పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలి అని తీర్పు చెప్పారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, డీజీపీ, టాస్మాక్ యాజమాన్యంలను ఈ కోర్టు తానుగా ముందుకు వచ్చి ఈ బెయిల్ పిటిషన్‌పై వ్యతిరేక పిటిషన్ దారులుగా చేరుస్తోంది. వీరందరూ 14 ప్రశ్నలకు కోర్టుకు బదులివ్వాల్సి ఉంటుంది. దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే 500 టాస్మాక్‌లకు తాళం వేసింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ తేదీ నుంచి సంపూర్ణ మధ్య నిషేధం అమలవుతుంది? భారత్‌లోనూ, తమిళనాడులోనూ మద్యసేవనం పెరిగిపోతోందా? మద్యానికి బానిసలైన వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోందా ? ఈ ప్రశ్నకు ఏడాదివారిగా వివరాలు ఇవ్వాలి.
మద్య సేవనం వల్ల నేరాలు ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయా ? గత పదేళ్లలో మద్య సేవనం నేపథ్యంలో ఏఏ నేరాలు చోటుచేసుకున్నాయి.? ఈ వివరాలను సైతం ఏడాది వారిగా దాఖలు చేయాలి. మద్యం సులభంగా అందుబాటులో ఉన్నందున పిల్లలు, విద్యార్థులు సైతం ఆకర్షితులు అవుతున్నారా? మద్యం తాగడం వల్ల చిన్నారులు నేరాలకు పాల్పడుతున్నారా ? మద్యం అమ్మకాల నేపథ్యంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారా ? పిల్లలకు మద్యం అమ్మ కూడదన్న చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కఠినంగా అమలు చేయకూడదు? చిన్నారులను మద్యానికి దూరం చేసేలా చైతన్యప్రచారాలను ఎందుకు చేపట్టకూడదు ?
మద్యానికి బానిసలైన మగవారి వల్ల భార్యా పిల్లలు మానసికంగా బాధపడుతున్నారా ? సంపాదనంతా మద్యానికి ఖర్చు చేయడం వల్ల కుటుంబాల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం వాస్తవమేనా ? మద్యం సేవనం వల్ల చోటుచేసుకునే అనర్థాలపై అవగాహనకు తగిన నిధులు కేటాయిస్తారా? రోజుకు 70 లక్షల మంది మద్యంను సేవిస్తుండగా, ప్రతి 96 నిమిషాలకు ఒకరు చొప్పున మద్యంతో మరణిస్తుండగా, వీరికి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? మద్యం నుంచి విముక్తి తాలూకా స్థాయిలో కౌన్సెలింగ్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయరాదు? ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున బదులు చెప్పాలని ఆదేశించిన న్యాయమూర్తి కృపాకరన్ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.
సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు?
Published Wed, Feb 8 2017 2:15 AM | Last Updated on Fri, Aug 17 2018 7:51 PM
Advertisement