డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్‌

Published Thu, Aug 24 2023 2:08 AM | Last Updated on Thu, Aug 24 2023 8:19 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరెప్షన్‌(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు.

అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు...
డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ ఆర్‌. రామచంద్రన్‌, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

జస్టిస్‌ ఆనంద్‌ వెంటకేషన్‌ కన్నెర్ర
కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్‌కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్‌సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేషన్‌ అప్పీల్‌ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్‌ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్‌ వెంకటేషన్‌ టార్గెట్‌ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్‌ఎస్‌ఆర్‌లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేషన్‌ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు.

న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేషన్‌ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు.

తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్‌ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు.

సుమోటోగా కేసులు
అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేషన్‌ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్‌ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్‌ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement