‘హంగ్’లారుస్తూ..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ప్రాదేశిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక కూడా, కొందరు నేతలకు ఆర్థికభారం తప్పడం లేదు. జిల్లాలో 28 మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మండల పరిషత్‌లలో హంగ్ ఏర్పడింది. మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని పోస్టులు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొత్తం 59 మండలాలకు గాను 835 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఆయా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్యను బట్టి, మెజారిటీ సభ్యులను గెలుచుకున్న పార్టీకి పాలక వర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీన వెలువడిన ఫలితాలు కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలకు నిరాశనే మిగిల్చాయి. మొత్తం 59 మండలాల్లో కాంగ్రెస్ ఏకంగా 25 మండలాల్లో పాలక వర్గాలను ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంది. టీఆర్ఎస్-3, టీడీపీ-2, ఇండిపెండెంట్లు ఒక చోట అవకాశం దక్కించుకున్నారు. మిగిలిన 28చోట్ల ఎవరికీ సరిపోను మెజారిటీ రాకపోవడంతో ఒకరి సభ్యులను ఒకరు లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది.
దీంతో ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే రహస్య ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎంపీపీ పదవులను ఆశిస్తున్న వారు, తమకు మద్దతుగా కూడగట్టిన సభ్యులను క్యాంపులకు తీసుకువెళ్లారు. జూన్ 2వ తేదీ తర్వాతే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగే వీలుంది. దీంతో అప్పటి వరకు వీరిని కాపాడుకునేందుకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు తిప్పుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకూ తరలివెళ్లారు. మొత్తానికి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు మాత్రం తడిచి మోపెడు అవుతున్నాయి.
చండూరు మండలంలో 14ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్-4, టీడీపీ-4, స్వతంత్రులు-3, టీఆర్ఎస్-1, సీపీఎం-1, బీజేపీ-1చొప్పున ఎంపీటీసీలను గెలుచుకున్నాయి. టీడీపీకి ఉన్న 4 ఎంపీటీసీ సభ్యులకు ముగ్గురు స్వతంత్రులు తోడయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన గట్టుప్పల్-2ఎంపీటీసీ సభ్యుడు అవ్వారు శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో నలుగురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు పెట్టారు. కాంగ్రెస్‌లో నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. వీరిని టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు తోకల వెంకన్న రెండురోజుల కిందట క్యాంపునకు తరలించారు.
ఆత్మకూరు(ఎం)మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్దానాలకు గానూ టీఆర్ఎస్కు 6 ఎంపీటీసీ స్థానాలు, కాంగ్రెస్‌కు 4 ఎంపీటీసీ స్థానాలు, టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. అయితే ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను కైవసం చేసుకునే మెజారీటి స్థానాలు టీఆర్ఎస్కు ఉన్నా, ఫలితాలు వెలువడిన 13వ తేదీ నుంచీ టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు రహస్య శిబిరంలోనే ఉన్నారు.
కట్టంగూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవి కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యు లు ఇద్దరు స్వతంత్ర, , టీడీపీ అభ్యర్థితో కలిసి మూడు రోజుల క్రితం క్యాంపునకు తరలి వెళ్లారు. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, టీఆర్ఎస్కు 3, సీపీఎంకు 3, స్వతంత్ర అభ్యర్థులు 2, టీడీపీ 1 గెలుచుకున్నాయి. కాంగ్రెకు పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు స్వతంత్ర, ఒక టీడీపీ అభ్యర్థితో బేరసారాలు జరుగుతున్నాయి.
తుంగతుర్తి నియోజకవర్గంలోని 6మండలాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. తిరుమలగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 8మంది ఇండిపెండెంట్లు , కాంగ్రెస్ 3, టీఆర్ఎస్కు 3స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు చేజారిపోకుండా క్యాంప్‌నకు తరలించారు.
మోత్కూరు మండలంలో 16ఎంపీటీసీలకు కాంగ్రెస్ -4, ఇండిపెండెంట్లు నలుగురు (ఒక కూటమి) టీఆర్ఎస్-3, సీపీఐ 3, టీడీపీ ఇద్దరు అభ్యర్థులు (రెండో కూటమి) గెలుపొందారు. రెండు కూటములకు సమానంగా రావడంతో ఎవరి అభ్యర్థులను వారు క్యాంప్‌లకు తరలించారు.
రామన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీకి -3, సీపీఎం-2, బీజీపీ-1, కాంగ్రెస్-4 , ఇండిపెండెట్లు-5 వచ్చాయి. ఇండెంపెండెంట్ల కీలకంగా మారారు. వీరి సహకారంతో టీడీపీ ఎంపీపీ పీఠం దక్కించుకునేందకు ప్రయత్నిస్తింది. ఎవరికి వారే క్యాంపులకు వెళ్లి పోయారు.
కేతేపల్లి మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, టీఆర్ఎస్ , టీడీపీలు మూడు పార్టీలు కలిసి పోత్తుతో పోటి చేశాయి. ఈ కూటమికి 7 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 3, ఇండింపెండెంట్కు 1 స్థానం దక్కింది. మోజారిటీస్థానాలు సీపీఎం, టీఆర్ఎస్, టీడీపీలకు ఉన్నా , ఎంపీపీ రేసులో ఉన్న కొర్లపాడు సీపీఎం అభ్యర్థి గుత్త మంజుల ఆరుగురు ఎంపీటీసీ సభ్యులను ఆరు రోజలు కిందటే క్యాంపునకు తీసుకవెళ్లారు.
మఠంపల్లి మండలంలో మొత్తం 13 ఎంపీటీసీలకు గాను టీడీపీ 7, కాంగ్రెస్ 3, సీపీఎం 1, సీపీఐ 1, వైఎస్సార్సీపీ 1 స్థానాన్ని గెలుపొందాయి. కాగా సీపీఎం ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు ఎంపీటీసీల బలం 4కు చేరింది. టీడీపీ ఎంపీటీసీలలో చీలిక వస్తుందేమోనని ఆందోళనతో టీడీపీ ఎంపీటీసీలు 7 గురు సీపీఐ ఎంపీటీసీతో కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు.
మేళ్లచెరువు మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్సీపీ 5, టీడీపీ 5, కాంగ్రెస్ 8, ఇండిపెండెంట్లు 2, సీపీఐ 1 ఎంపీటీసీలు గెలుపొందాయి. టీడీపీ, ైవె ఎస్సార్సీపీలు ఎంపీపీ విషయంలో ఎన్నికలకు ముందే జత కట్టడంతో వారి బలం 10 మంది సభ్యులతో ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ 8 మంది సభ్యులతో పాటు 1 సీపీఐ, 1 ఇండిపెండెంట్‌తో ఎంపీపీ పీఠం కోసం సిద్ధమయ్యారు. ఇక మిగిలిన కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడు కీలకం కావడంతో టీడీపీ, వైఎస్సార్సీపీల కూటమి కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడితో కలిసి ఇతర రాష్ట్రాలకు క్యాంప్‌కు వెళ్లారు.