high pressure
-
ఒత్తిడితో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
ఆత్మకూరు: అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు రూ.1.50 కోట్లు డిపాజిట్ చేయించిన ఓ ఏజెంట్.. ఆ కంపెనీ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలై మృతిచెందాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేరారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన వల్లెపు వెంకటరమణ (47) అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా ఉంటూ ఆ కంపెనీకి చెందిన నెల్లూరు, ఆత్మకూరు కార్యాలయాల్లో డిపాజిట్లు కట్టించాడు. ఆ కంపెనీ చేతులెత్తేయడంతో సొమ్ము కోసం అతడిపై డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరిగింది. చెల్లింపుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతుండటంతో ఒత్తిడికి గురయ్యాడు. వారం క్రితం అనారోగ్యం పాలయ్యాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వెంకటరమణకు భార్య రత్నమ్మ, పదేళ్ల కుమారుడు ఉన్నారు. రక్షణ కల్పించండి: ఏజెంట్లు వెంకటరమణ మృతి చెందడంతో అగ్రి గోల్డ్ ఏజెంట్లు ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. అగ్రి గోల్డ్ సంస్థను నమ్మి కోట్లాది రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి వివిధ పథకాల్లో డిపాజిట్లు చేయించామని చెప్పారు. ఆ సంస్థ చేతులెత్తేసిందని, సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోవడంతో డిపాజిటర్ల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఐ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. -
సిటీ బ్రెయిన్‌కు స్ట్రోక్ ముప్పు..!
నగరంలో పెరుగుతున్న కేసులు మద్యం, ధూూమపానం వల్లే ఎక్కువ వైద్యుల పరిశీలనలో వెల్లడి పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ నిపుణుల లెక్క.. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం. ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. తొలిసారి స్ట్రోక్‌కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు. పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది. -
పరుగులు పెట్టించిన అకాల వర్షం
నాదెండ్ల : బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా సోమవారం ఉదయం పడిన చిరుజల్లులు రైతులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. వ్యవసాయపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అకాల వర్షం రైతులకు కొంత నష్టాన్ని కలిగించింది. పత్తి పంట 70 శాతం వరకు చేతికందింది. చేలపై ఉన్న మిగిలిన పంట వర్షంతో తడిసింది.కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న పరదాలను తెచ్చి కప్పారు. పొలంలో 50 శాతంపైగా మిరపకాయలు పండి కోతకు వచ్చాయి. ఈ సమయంలో కురిసిన వర్షంతో తాలుకాయలు అయ్యి పంట రంగుమారి ధర పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిపంట కోతకు వచ్చి పొలాల్లోనే కుప్పలు పోశారు. వర్షంతో ధాన్యం రంగుమారే అవకాశం ఉందంటున్నారు. నూర్పిడి పూర్తై రైతులు పశుగ్రాసం ఇళ్లకు తెచ్చి ఉంచారు. వాములు వేయకముందే చిరుజల్లులు పడడంతో తడిసిపోకుండా పట్టలు కప్పారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రబీ రైతుల ఆందోళన చిలకలూరిపేటరూరల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ఇదేతరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా బర్లీ, బ్యారన్ పొగాకు పండించే రైతులు ఈ వర్షం కారణంగా దిగుబడిలో గ్రేడ్ రాదని పేర్కొంటున్నారు.పొలాల్లోనే బర్లీ పొగాకును ఆరబెట్టారు. అలాగే పత్తి, శనగ, మిర్చి తడిసినట్టు రైతులు తెలిపారు. తెనాలిలో అకాల వర్షం తెనాలిఅర్బన్ : తెనాలి పట్టణంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం కొద్దిసేపు హడావుడి చేసింది. ఒక్కసారిగా పెద్దగా వర్షం రావటంతో రోడ్డుపై ప్రజలు తలదాచుకునేందుకు సమీపంలోని షాపుల్లోకి పరుగులు పెట్టారు. నకరికల్లులో.. నకరికల్లు : ఆకాశంలో కారుమబ్బులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 1800 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇప్పటి వరకు కౌలురైతులు సుమారు రూ.30 వేలు, సొంతరైతులు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ప్రస్తుతం కోతకు వస్తోంది. ఈ తరుణంలో ఆకాశం మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తిపంట చేలోనే తడిసి పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాచర్లలో.. మాచర్లటౌన్ : ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది. సోమవారం ఉదయం ఆకాశం మబ్బులు పట్టి పట్టణ శివారులో వర్షం కురిసింది. మార్కెట్‌యార్డులోని సీసీఐ కేంద్రంలో నిల్వ ఉంచిన పత్తిబోరాలపై ఒక్కసారిగా వర్షం కురవటంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే పట్టలు కప్పేందుకు హడావుడి పడ్డారు. నెహ్రూనగర్, రాయవరం, కంభంపాడు గ్రామాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న మిర్చి దెబ్బతింటుందని ఆందోళన చెందిన రైతులు పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు మిర్చియార్డులో.. పాతగుంటూరు : గుంటూరులో సోమవారం తెల్లవారుజామున చిరుజల్లులు పడటంతో యార్డులో మిర్చి టిక్కీలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. వేమెన్స్ , కమీషన్ షాపుల వద్ద ఉన్న పట్టలను తెచ్చుకుని మిర్చిని కాపాడుకున్నారు. చిరుజల్లులతోనే వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది రైతులు వర్షం పెద్దదవుతుందేమోనని ఆందోళనతో మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీకి తరలించారు.