నాదెండ్ల : బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా సోమవారం ఉదయం పడిన చిరుజల్లులు రైతులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. వ్యవసాయపనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో అకాల వర్షం రైతులకు కొంత నష్టాన్ని కలిగించింది. పత్తి పంట 70 శాతం వరకు చేతికందింది. చేలపై ఉన్న మిగిలిన పంట వర్షంతో తడిసింది.కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు. ఇళ్లల్లో ఉన్న పరదాలను తెచ్చి కప్పారు. పొలంలో 50 శాతంపైగా మిరపకాయలు పండి కోతకు వచ్చాయి.
ఈ సమయంలో కురిసిన వర్షంతో తాలుకాయలు అయ్యి పంట రంగుమారి ధర పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిపంట కోతకు వచ్చి పొలాల్లోనే కుప్పలు పోశారు. వర్షంతో ధాన్యం రంగుమారే అవకాశం ఉందంటున్నారు. నూర్పిడి పూర్తై రైతులు పశుగ్రాసం ఇళ్లకు తెచ్చి ఉంచారు. వాములు వేయకముందే చిరుజల్లులు పడడంతో తడిసిపోకుండా పట్టలు కప్పారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
రబీ రైతుల ఆందోళన
చిలకలూరిపేటరూరల్ : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ఇదేతరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా బర్లీ, బ్యారన్ పొగాకు పండించే రైతులు ఈ వర్షం కారణంగా దిగుబడిలో గ్రేడ్ రాదని పేర్కొంటున్నారు.పొలాల్లోనే బర్లీ పొగాకును ఆరబెట్టారు. అలాగే పత్తి, శనగ, మిర్చి తడిసినట్టు రైతులు తెలిపారు.
తెనాలిలో అకాల వర్షం
తెనాలిఅర్బన్ : తెనాలి పట్టణంలో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం కొద్దిసేపు హడావుడి చేసింది. ఒక్కసారిగా పెద్దగా వర్షం రావటంతో రోడ్డుపై ప్రజలు తలదాచుకునేందుకు సమీపంలోని షాపుల్లోకి పరుగులు పెట్టారు.
నకరికల్లులో..
నకరికల్లు : ఆకాశంలో కారుమబ్బులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో సుమారు 1800 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ఇప్పటి వరకు కౌలురైతులు సుమారు రూ.30 వేలు, సొంతరైతులు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ప్రస్తుతం కోతకు వస్తోంది. ఈ తరుణంలో ఆకాశం మబ్బులు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తిపంట చేలోనే తడిసి పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మాచర్లలో..
మాచర్లటౌన్ : ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం రాత్రి నుంచే వాతావరణంలో మార్పు వచ్చింది. సోమవారం ఉదయం ఆకాశం మబ్బులు పట్టి పట్టణ శివారులో వర్షం కురిసింది. మార్కెట్‌యార్డులోని సీసీఐ కేంద్రంలో నిల్వ ఉంచిన పత్తిబోరాలపై ఒక్కసారిగా వర్షం కురవటంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే పట్టలు కప్పేందుకు హడావుడి పడ్డారు. నెహ్రూనగర్, రాయవరం, కంభంపాడు గ్రామాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న మిర్చి దెబ్బతింటుందని ఆందోళన చెందిన రైతులు పట్టలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు.
గుంటూరు మిర్చియార్డులో..
పాతగుంటూరు : గుంటూరులో సోమవారం తెల్లవారుజామున చిరుజల్లులు పడటంతో యార్డులో మిర్చి టిక్కీలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. వేమెన్స్ , కమీషన్ షాపుల వద్ద ఉన్న పట్టలను తెచ్చుకుని మిర్చిని కాపాడుకున్నారు. చిరుజల్లులతోనే వర్షం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది రైతులు వర్షం పెద్దదవుతుందేమోనని ఆందోళనతో మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీకి తరలించారు.
పరుగులు పెట్టించిన అకాల వర్షం
Published Tue, Mar 3 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement