కారం పండుగ
పండుగకు తరచూ చేసుకునేది మిఠాయిలే కానీ ఇప్పుడు మార్కెట్లో పండుమిరపకాయలు బోలెడు దొరుకుతున్నాయి. అందుకే సరదాగా కారం పండుగ చేసుకుందాం
పండు మిర్చి – గోంగూర కారం
కావలసినవి: పండు మిర్చి – 500 గ్రా.; గోంగూర – 10 కట్టలు; వెల్లుల్లి రేకలు – 5; ధనియాలు – టేబుల్ స్పూను; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 10; సెనగ పప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఇంగువ – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – తగినంత; నూనె – 150 గ్రా.; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను
తయారి: ∙ముందుగా గోంగూరను శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ∙పండు మిర్చి తొడిమలు తీసి శుభ్రంగా కడిగి ఆరిన తరవాత, చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి ∙బాణలలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర వేసి పచ్చి పోయేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి పండు మిర్చి ముక్కలు, చింతపండు వేసి వేయించి తీసేయాలి ∙అదే బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙మిక్సీలో ముందుగా గోంగూర, చింతపండు వేసి మెత్తగా చేయాలి ∙పండు మిరప ముక్కలు వేసి మరోమారు తిప్పాలి ∙తగినంత ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు జత చేసి బాగా కలిపి సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.
పండు మిర్చి పచ్చడి
కావలసినవి: పండు మిర్చి – 500 గ్రా.; చింతపండు – 150 గ్రా; ఉప్పు – తగినంత; పసుపు – టేబుల్ స్పూను; మెంతులు – టేబుల్ స్పూను (వేయించి మిక్సీలో వేసి పొడి చేయాలి) వెల్లుల్లి రేకలు – 50 గ్రా.; పోపు కోసం... నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సెనగ పప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు
తయారి: ∙ముందుగా పండు మిర్చిని శుభ్రంగా కడిగి తడి పోయేవరకు ఆరబెట్టాలి ∙చింతపండులోని గింజలు, ఈనెలు తీసి పక్కన ఉంచాలి ∙ తొడిమలు తీసి, పండు మిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి, ఉప్పు, పసుపు జత చేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙ ఒక పాత్రలో ముందుగా చింతపండు వేసి, ఆ పైన మిక్సీ పట్టిన పండు మిర్చి ముద్ద వేసి మూత పెట్టి మూడు రోజులు అలానే ఉంచాలి ∙మూడు రోజుల తరవాత మిశ్రమం అంతా బయటకు తీసి, మరోమారు మిక్సీలో వేసి అన్నీ కలిసేలా ఒకసారి మిక్సీ పట్టి తీసేయాలి ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వరసగా వేసి దోరగా వేగాక తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో పోపు వేసి కలియబెట్టాలి ∙మెంతి పొడి, వెల్లుల్లి రేకలు వేసి మరోమారు కలిపి, వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.
పండు మిర్చి – చికెన్ కుర్మా
కావలసినవి: గ్రేవీ కోసం... పండు మిర్చి – 6 (శుభ్రంగా కడిగి తొడిమలు తీసి ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టొమాటోలు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)
కూర కోసం... చికెన్ – అర కేజీ; పసుపు – పావు టీ స్పూను; నూనె – 4 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 3; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి); కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; చిక్కగా గిలకొట్టిన మజ్జిగ – అర కప్పు ; నీళ్లు – కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; కొత్తిమీర – పావు కప్పు (సన్నగా తరగాలి)
గ్రేవీ తయారీ... మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి.
కూర తయారి ∙చికెన్, పసుపు జత చేసి బాగా కలిపి సుమారు 20 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి బాణలి వేడయ్యాక నూనె పోసి కాగనివ్వాలి ∙లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి మెత్తగా అయ్యేవరకు కలియబెట్టాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వాసన పోయేవరకు రెండు నిమిషాలు ఉడికించాలి ∙చికెన్ వేసి కలిపి, పైన ధనియాల పొడి, చిక్కటి మజ్జిగ, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ∙గ్రేవీ జత చేసి, కప్పుడు నీళ్లు, గరం మసాలా వేసి బాగా కలపాలి ∙గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి ∙కొత్తిమీర జత చేసి దింపేయాలి.
పండు మిర్చి – టొమాటో – కొత్తిమీర చట్నీ
కావలసినవి: పండు మిర్చి – 10; కొత్తిమీర – కప్పు; టొమాటో ముక్కలు – కప్పు; పచ్చి సెనగపప్పు – టీ స్పూను; ధనియాలు – టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఉప్పు – తగినంత
తయారి: ∙ముందుగా బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, పచ్చి సెనగపప్పు, ధనియాలు వేసి వేయించాలి ∙వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు వేయించాలి ∙పండు మిర్చి, టొమాటో ముక్కలు జత చేసి బాగా కలపాలి ∙పదార్థాలన్నీ బాగా వేగిన తరవాత కొత్తిమీర జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ∙తగినంత ఉప్పు జత చే సి, బాగా కలపాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙మిక్సీ పట్టిన పచ్చడిని పోపులో వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపాలి.
పండు మిర్చి స్పైసీ ఫిష్ కర్రీ
కావలసినవి: చేపలు – 500 గ్రా.; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి); టొమాటోలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; అల్లం తరుగు – టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – 7 రెమ్మలు; పండు మిర్చి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు; చింతపండు రసం – అర కప్పు; సన్నగా తరిగిన కొత్తిమీర – అర కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – కప్పుడు
పండు మిర్చి పేస్ట్ కోసం... పండు మిర్చి – 10; వేయించిన జీలకర్ర – టీ స్పూను; వేయించిన మెంతులు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 3; ఉప్పు – అర టీ స్పూను; నీళ్లు – మిక్సీలో గ్రైండ్ చేయడానికి సరిపడా; ఈ పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
తయారి: ∙చేపల మీద కొద్దిగా ఉప్పు రుద్ది, శుభ్రంగా కడగాలి ∙పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి ∙టొమాటో ముక్కలు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు వేయించాలి ∙పండు మిర్చి పేస్ట్ జత చేసి రెండు నిమిషాలు వేయించాలి ∙చింతపండు రసం, ఉప్పు, కప్పుడు నీళ్లు వేసి మరోమారు బాగా కలపాలి ∙గ్రేవీ బాగా ఉడుకుతుండగా చేప ముక్కలు, కొత్తిమీర తరుగు, మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి ∙మంట బాగా తగ్గించి సుమారు పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙మూత పెట్టి గంట తరవాత వడ్డించాలి.